Nitin Gadkari: అమెరికా రోడ్లలాగా మన రహదారులను తీర్చిదిద్దుతాం: గడ్కరీ

Indian Roads To Match US Standards By End Of 2024 says Nitin Gadkari
  • 2024 నాటికి మన దేశపు రోడ్లు మెరిసిపోయేలా చేస్తామన్న గడ్కరీ 
  • ఎఫ్ఐసీసీ వార్షిక సమావేశంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
  • ఆటోమొబైల్ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలబెడతామని హామీ
దేశంలో రోడ్ల నాణ్యతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో మన దేశ రహదారులను అమెరికా రహదారుల తరహాలో మెరిసిపోయేలా చేస్తామని తెలిపారు. ఈమేరకు ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఎఫ్ఐసీసీ వార్షిక సమావేశంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 ఏడాది ముగిసే సమయానికి అమెరికా రహదారుల నాణ్యతతో పోటీపడేలా మన దేశపు రహదారులను తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు.

రవాణా ఖర్చులను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అదేవిధంగా నిర్మాణ రంగంలో వనరుల వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయాల వాడకంపై దృష్టి పెట్టినట్లు గడ్కరీ తెలిపారు. భవన నిర్మాణాల్లో స్టీల్ వాడకానికి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. భవిష్యత్తు మొత్తం గ్రీన్ హైడ్రోజన్ దేనని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. వైమానిక రంగంతో పాటు రైల్వేలు, రోడ్ ట్రాన్స్ పోర్ట్, కెమికల్, ఫెర్టిలైజర్ కంపెనీలలో గ్రీన్ హైడ్రోజన్ వాడకం పెరుగుతుందని వివరించారు.

ప్రస్తుతం దేశంలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీ విలువ 7.5 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని చెబుతూ.. దీనిని 15 లక్షల కోట్ల రూపాయలకు తీసుకెళ్లడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గడ్కరీ వివరించారు. మన ఆటోమొబైల్ రంగాన్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలబెడతామని మంత్రి చెప్పారు. దీనివల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, నిరుద్యోగ సమస్య కొంత తగ్గుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Nitin Gadkari
indian roads
american roads
2024
FICC

More Telugu News