Corona Virus: వచ్చే ఏడాది నాటికి చైనాలో 10 లక్షలకుపైగా కొవిడ్ మరణాలు!

China May See Over 1 Million Covid Deaths Through 2023
  • ప్రపంచంలోనే అత్యంత కఠిన కొవిడ్ ఆంక్షలు అమలు చేసిన చైనా
  • ప్రజాగ్రహం కారణంగా ఆంక్షల ఎత్తివేత
  • వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి పతాక స్థాయికి కేసులు చేరుకుంటాయన్న ఐహెచ్ఎంఈ
  • ఇప్పటి వరకు 5,235 మంది మృత్యువాత
జీరో కొవిడ్ విధానంతో కొత్త తలనొప్పులు తెచ్చుకుని ప్రజాగ్రహంతో దిగివచ్చిన చైనా కరోనా ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నిబంధనలు ఎత్తేసిన చైనా.. టెస్టింగ్ సెంటర్లను కూడా మూసేస్తోంది. దీంతో ప్రతి రోజూ వేలాది కేసులు నమోదవుతున్నాయి. చైనా తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది నాటికి ఆ దేశంలో కరోనా మరణాలు 10 లక్షలు దాటిపోతాయని అమెరికాకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్ఎంఈ) అంచనా వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి చైనాలో కేసులు పతాక స్థాయికి చేరుకుంటాయని, అప్పటికి మరణాలు 3,22,000కు చేరుకుంటాయని పేర్కొంది. అంతేకాదు, అప్పటికి చైనా జనాభాలో మూడొంతుల మంది కరోనా బారినపడతారని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు.

చైనా నేషనల్ హెల్త్ అథారిటీ చివరిసారి డిసెంబరు 3న కరోనా మరణాలను నివేదించింది. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాతి నుంచి ఇప్పటి వరకు అధికారికంగా కరోనా మరణాలను వెల్లడించలేదు. చైనా అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఆ దేశంలో ఇప్పటి వరకు 5,235 మంది మాత్రమే కరోనా కారణంగా మృతి చెందారు. ప్రపంచంలోనే అత్యంత కఠినంగా కరోనా ఆంక్షలు అమలు చేస్తున్న చైనా.. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరగడంతో ఈ నెలలో ఆంక్షలను ఎత్తివేసింది. అయితే, ఇప్పుడు వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే నెలలో చైనా జరుపుకోనున్న కొత్త సంవత్సరం వేడుకల నాటికి దేశంలోని అందరికీ కరోనా సోకుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Corona Virus
China
IHME
Corona Deaths

More Telugu News