Kuldeep Yadav: అశ్విన్, కుంబ్లే రికార్డులను బద్దలుగొట్టి.. అతిపెద్ద రికార్డు సాధించిన కుల్దీప్ యాదవ్

 Kuldeep Yadav Surpasses Ravichandran Ashwin and Anil Kumble Test Records
  • తొలి టెస్టులో విజయం దిశగా భారత్
  • బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన కుల్దీప్ యాదవ్
  • బ్యాట్‌తోనూ రాణించిన చైనామన్ బౌలర్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టుబిగించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఘనమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 22 నెలల తర్వాత టెస్టు క్రికెట్‌లోకి తిరిగొచ్చిన కుల్దీప్.. కెరియర్‌లోనే బెస్ట్ ఫిగర్స్ (5/40) నమోదు చేశాడు. మ్యాచ్ రెండో రోజు నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్.. మూడో రోజు ఒక వికెట్ పడగొట్టాడు. అంతకుముందు కుల్దీప్ భారత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ రాణించి 40 పరుగులు చేశాడు. 

ఈ ప్రదర్శనతో కుల్దీప్.. ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ (5/87), మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (4/55) రికార్డులను బద్దలుగొట్టాడు. బంగ్లాదేశ్‌పై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఇండియన్ స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో కుల్దీప్‌కు ఇది మూడో అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పైనా ఈ ఘనత సాధించాడు. 

తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 150 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు ఫాలోఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. శుభమన్ గిల్ (110), చతేశ్వర్ పుజారా (102) సెంచరీలతో చెలరేగడంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌ను 258/2 వద్ద డిక్లేర్ చేసి ఆతిథ్య జట్టుకు 513 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండడంతో బంగ్లాదేశ్ ఓటమి నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.
Kuldeep Yadav
Ravichandran Ashwin
Anil Kumble
Test Record
Team India
Bangladesh

More Telugu News