Narendra Modi: రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోదీ ఫోన్

  • ఉక్రెయిన్ వివాదంపై మాట్లాడుకున్న మోదీ, పుతిన్
  • చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న మోదీ
  • సైనిక చర్యకు దారితీసిన కారణాలు వివరించిన పుతిన్
Prime Minister Narendra Modi talks to Putin

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో టెలిఫోన్ లో సంభాషించారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ఉక్రెయిన్ తో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాట్లాడారని పీఎంవో వెల్లడించింది. 

ఈ సమస్య పరిష్కారానికి చర్చలు, దౌత్యపరమైన ప్రక్రియలే మార్గమని భారత్ వైఖరిని పునరుద్ఘాటించారని వివరించింది. అంతేకాకుండా, భారత్-రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలను కూడా ఇరువురు నేతలు సమీక్షించారని తెలిపింది. ఇంధనం, శక్తి, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రతా సహకారం తదితర కీలక రంగాలపైనా చర్చించినట్టు వెల్లడించింది. గత సెప్టెంబరులో ఎస్ సీవో సదస్సులో భేటీ అయిన తర్వాత మోదీ, పుతిన్ మధ్య సంభాషణ ఇదే ప్రథమం. 

అటు, ఈ టెలిఫోన్ సంభాషణపై రష్యా అధ్యక్ష కార్యాలయం కూడా స్పందించింది. ఉక్రెయిన్ తో వివాదంపై భారత ప్రధాని మోదీకి పుతిన్ ప్రాథమిక కారణాలు వివరించారని తెలిపింది. అంతేకాకుండా, రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయి సహకారంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించింది.

More Telugu News