Rahul Gandhi: గుజరాత్ లో ఆప్ మా విజయావకాశాలను దెబ్బతీసింది: రాహుల్ గాంధీ

  • భారత్ జోడో యాత్రకు 100 రోజులు పూర్తి
  • రాజస్థాన్ లో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్
  • గుజరాత్ లో ఆప్ వల్లే తమ అవకాశాలు దెబ్బతిన్నాయని వెల్లడి
  • బీజేపీకి ఆప్ బీ-టీమ్ అని విమర్శలు
Rahul Gandhi criticizes AAP for Congress party failure in Gujarat

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన రాజస్థాన్ లో మీడియాతో మాట్లాడారు. గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై స్పందించారు. 

గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం వల్లే కాంగ్రెస్ అవకాశాలు దెబ్బతిన్నాయని వివరించారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపించారు. బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ బీ-టీమ్ అని అభివర్ణించారు. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీనే గెలిచేదని అభిప్రాయపడ్డారు. 

బీజేపీని ఓడించేది తామేనని రాహుల్ ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పనైపోయిందని చాలామంది అనుకుంటున్నారని, కానీ బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందన్న విషయాన్ని రాసిపెట్టుకోవాలని అన్నారు. బీజేపీపై పోరాడే ధైర్యం లేనివారు పార్టీని వీడాలంటూ స్పష్టం చేశారు. 

ఇక చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలపైనా రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. సరిహద్దుల వద్ద చైనా ప్రయత్నాలు చొరబాటు కోసం కాదని, యుద్ధం కోసమేనని స్పష్టం చేశారు. చైనా ఉపయోగిస్తున్న ఆయుధాలు, ఇతర రక్షణ వ్యవస్థలు చూస్తుంటే వారు వస్తున్నది చొరబాటుకు కాదన్న విషయం అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. 

ఓవైపు చైనాతో ముప్పు స్పష్టంగా కనిపిస్తుంటే కేంద్రం నిద్రపోతోందని విమర్శించారు. పైగా ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. చైనాతో ముప్పు ఉందన్న విషయాన్ని తాను రెండు మూడేళ్లుగా చెబుతున్నానని, కానీ కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. చైనా అంశంలో ఎవరి మాటా వినరాదని ఈ ప్రభుత్వం అనుకుంటోందా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యూహాత్మక విధానాలు లోపించాయని రాహుల్ గాంధీ విమర్శలు చేశారు.

More Telugu News