Atchannaidu: జగన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను ఉత్సవ విగ్రహాల్లా చేశారు: అచ్చెన్నాయుడు 

Atchannaidu fires on CM Jagan over BC Corporations Chairmen tenure comes to an end
  • ఏపీలో ముగిసిన బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల పదవీకాలం
  • 2020లో పదవీ ప్రమాణస్వీకారం
  • ముగిసిన రెండేళ్ల కాలవ్యవధి
  • ఒక్క పైసా ప్రయోజనం లేదన్న అచ్చెన్నాయుడు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక 56 బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను, 672 మంది డైరెక్టర్లను నియమించింది. వీరు 2020 డిసెంబరు 17న పదవులు చేపట్టారు. వీరి రెండేళ్ల పదవీకాలం నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. 

బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను ఉత్సవ విగ్రహాల్లా చేశారని మండిపడ్డారు. చైర్మన్లు ఒక్క పైసా ప్రయోజనం కల్పించకుండానే పదవీకాలం పూర్తిచేసుకున్నారని తెలిపారు. పదవి తీసుకున్నాక ప్రమాణ స్వీకారం... ఇప్పుడు పదవీ విరమణ తప్ప ఈ రెండేళ్ల కాలంలో వారు చేసిందేమీ లేదని పెదవి విరిచారు.

బీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించి సొంత కాళ్లపై నిలబడేలా చేసే కార్పొరేషన్లకు సీఎం జగన్ ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకుండా కాళ్లు విరిచేశాడని అచ్చెన్నాయుడు విమర్శించారు. 56 మందిని బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమించిన జగన్ రెడ్డి... వారి కోసం ఎంత కేటాయించారో చెప్పగలరా? అని నిలదీశారు. 

"బీసీలకు ఏంచేశారని ఎవరైనా ప్రశ్నిస్తే దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. లెక్కలు అడిగితే కేసులు పెట్టి జైల్లో వేయిస్తున్నారు. బీసీ సంక్షేమం అంటే ఇదేనా? ఇదేనా బీసీలకు స్వావలంబన కల్పించం అంటే? బీసీ కార్పొరేషన్లకు బడ్జెట్ కేటాయింపులు చేయకపోగా, 2018-19లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన 70 వేల రుణాలను రద్దు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్ వంటి పథకాలు రద్దు చేసి బీసీ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో బీసీ కార్పొరేషన్లకు ఏటా రూ.1200 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.6 వేల కోట్లు బడ్జెట్ ఖర్చు చేసింది. 4.20 లక్షల మంది యువతకు రూ.2 లక్షల చొప్పున స్వయం ఉపాధి రుణాలిచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేసింది. 70 వేల మందికి ఫెడరేషన్ల ద్వారా గ్రూప్ రుణాలిచ్చింది. 

బీసీ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినపుడే బీసీల స్వావలంబన సాధ్యమని తెలుగుదేశం పార్టీ నమ్మింది. ఆచరించి అమలు చేసింది. కానీ బీసీలు అంటే ఓట్లు మాత్రమే అనే పరిస్థితి జగన్ రెడ్డి కల్పించారు. చేతి వృత్తులపై ఆధారపడే వారికి నాడు ప్రోత్సాహకాలిచ్చి అండగా నిలిస్తే... నేడు వారి చేతులు కట్టేసి ఓట్లు వేయించే పరిస్థితికి జగన్ రెడ్డి దిగజారారు. పైగా బీసీలను అణచివేయడమే లక్ష్యంగా దాడులు దౌర్జన్యాలకు తెరలేపారు. 

26 మంది బీసీల్ని హత్య చేశారు. 650 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. 2500 మందిపై దాడులకు పాల్పడ్డారు. బీసీ రిజర్వేషన్లను కుదించి 16,800 మందిని రాజ్యాధికారానికి దూరం చేసి.. బీసీలను నయవంచన చేశారు. జగన్ రెడ్డీ... నీ దాష్టీకాలకు ఘోరీ కట్టేందుకు బీసీలు ఏకమయ్యారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని బీసీలంతా ఏకమై బంగాళాఖాతంలో నిన్ను పడేయడం ఖాయమని గుర్తుంచుకో" అంటూ అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు.
Atchannaidu
Jagan
BC Corprations
Chairman
Tenure
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News