తక్కువ కార్బోహైడ్రేట్లతో మంచి చేసే కూరగాయలు ఇవే..!

  • క్యారట్, క్యాబేజీలో పీచు ఎక్కువ, కార్బోహైడ్రేట్లు తక్కువ
  • మష్ రూమ్, బ్రొకోలీలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ
  • మధుమేహులతో పాటు ఎవరైనా తీసుకోవచ్చు
Low carb magic vegetables people can safely eat

నేడు మధుమేహం, రక్తపోటు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు, బరువు పెరగడం ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహార పదార్థాల వల్లేనన్నది వైద్యుల విశ్లేషణ. పీచు తక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న వాటిని తీసుకున్న వారు, వాటిని ఖర్చు చేసే శ్రమ కలిగి ఉండాలి. లేదంటే వాటి వల్ల కేలరీలు కొవ్వుగా మారి శరీరంలో పెరిగిపోతాయి. ఎన్నో సమస్యలకు కారణమవుతాయి. తగినంత శ్రమ, శారీక వ్యాయామం లేని వారు కనీసం తమ ఆహారంలో అయినా కొన్ని మార్పులు చేసుకోవడం ఎంతైనా అవసరం. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవడం మంచిది.

క్యారట్లు
ఇది నాన్ స్టార్చీ (గంజి లేని) కూరగాయల గ్రూప్ నకు చెందినది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కనుక మధుమేహం ఉన్న వారు సైతం నిశ్చింతగా తినొచ్చు. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా విటమిన్ ఏ అధికంగా ఉండడంతో కంటికి సహజ రక్షణ లభిస్తుంది.

మష్ రూమ్
మష్ రూమ్ (పుట్టగొడుగులు)లోనూ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కనుక దీన్ని తిన్నప్పటికీ రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోదు. దీంతో మధుమేహం ఉన్న వారు సహా అందరూ తినొచ్చు. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం ఇది.

బ్రొకోలీ
ఒకప్పుడు ఇది మన దగ్గర లభించేది కాదు. కానీ, నేడు మనకు కూడా ఇది అందుబాటులోకి వచ్చింది. దీని ధర కాస్త అధికంగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారు సైతం నిక్షేపంలా తినతగినది. సల్ఫోరఫేన్ అనే కాంపౌండ్ ను బ్రొకోలీ ఉత్పత్తి చేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ ను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివీని పెంచుతుంది. ఇందులో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీలు ఎక్కువ. 

క్యాబేజీ
విటమిన్ సీ అధికంగా లభిస్తుంది. కనుక అందరూ తినొచ్చు. గుండె జబ్బులు, డయాబెటిస్ ఉన్న వారికి ఇంకా మంచిది. ఫైబర్ పుష్కలంగా ఉండడంతో నిదానంగా జీర్ణమవుతుంది. ఒక కప్పు క్యాబేజీ తరుగులో 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. 

క్యాలీ ఫ్లవర్
క్యాబేజీ మాదిరే క్యాలీ ఫ్లవర్ కూడా తక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్నది. ఒక కప్పు క్యాలీఫ్లవర్ లో ఉండే కార్బోహైడ్రేట్లు కేవలం 5 గ్రాములే. గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ. అంతేకాదు గ్లైసిమిక్ లోడ్ కూడా తక్కువే. నిదానంగా జీర్ణమవుతుంది.

పాలకూర
పాలకూర నుంచి ఫైబర్, విటమిన్ ఏ, బీ, సీ, ఫొలేట్, ఈ, కే లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోవు. 

టమాటాలు
క్యారట్ల మాదిరే టమాటాలు కూడా నాన్ స్టార్చీ రకం. గ్లైసిమిక్ వ్యాల్యూ తక్కువ. ఒక మధ్యస్థాయి టమాటా నుంచి కేవలం 5 గ్రాముల కార్బోహైడ్రేట్లు మాత్రమే లభిస్తాయి.

More Telugu News