Siraj: సిరాజ్ కు తోడు కుల్దీప్ స్పిన్ మాయాజాలం... బంగ్లాదేశ్ 133-8

  • భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 ఆలౌట్
  • అదే పిచ్ పై బంగ్లాదేశ్ విలవిల
  • ఫాలోఆన్ ప్రమాదంలో ఆతిథ్య జట్టు
Siraj and Kuldeep crumbles Bangladesh

బంగ్లాదేశ్ తో చట్టోగ్రామ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేసిన టీమిండియా... రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య బంగ్లాదేశ్ ను 133/8కి పరిమితం చేసింది. 

పేసర్ మహ్మద్ సిరాజ్ కు తోడు, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా విజృంభించడంతో బంగ్లాదేశ్ కష్టాలు రెట్టింపయ్యాయి. సిరాజ్ 3 వికెట్లతో బంగ్లా టాపార్డర్ ను దెబ్బతీయగా, ఆ తర్వాత కుల్దీప్ మాయాజాలం మొదలైంది. కుల్దీప్ 4 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు. 

బంగ్లా ఇన్నింగ్స్ లో ముష్ఫికర్ రహీం 28, లిట్టన్ దాస్ 24, ఓపెనర్ జకీర్ హుస్సేన్ 20 పరుగులు చేశారు. కెప్టెన్ షకీబల్ హసన్ కేవలం 3 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 271 పరుగుల దూరంలో ఉన్న బంగ్లాదేశ్ ఫాలోఆన్ లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ జట్టు చేతిలో మరో రెండు వికెట్లు మాత్రమే ఉండడంతో టీమిండియాకు భారీ తొలిఇన్నింగ్స్ ఆధిక్యం లభించే అవకాశాలు ఉన్నాయి.

More Telugu News