Kalava Srinivasulu: జగనన్న కాలనీలు అంటూ ఊదరగొట్టిన జగన్ చివరికి కన్నీళ్లే మిగిల్చాడు: కాలవ శ్రీనివాసులు

  • ఏపీలో గృహ నిర్మాణాలపై పార్లమెంటులో కేంద్రం వ్యాఖ్యలు
  • వందేళ్లయినా జగన్ 25 లక్షల ఇళ్లు కట్టలేడన్న కాలవ శ్రీనివాసులు
  • పేదలను నమ్మించి మోసం చేశాడని విమర్శలు
  • వైసీపీ నేతలు వందల కోట్లు మింగేశారని ఆరోపణ
Kalava Srinivasulu slams CM Jagan over Jagananna Colonies

మూడున్నరేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఐదు ఇళ్లు మాత్రమే కట్టిందని కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తేల్చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని జగన్ రెడ్డి ఊరువాడా ఊదరగొట్టాడని వెల్లడించారు. ముఖ్యమంత్రి అయ్యాక వాలంటీర్లు సర్వే చేసి 30 లక్షల ఇళ్లు కావాలని చెప్పారని, 2023 నాటికి ఇళ్లన్నీ కట్టేస్తానని చెప్పి, నమ్మినవారి నోట్లో మట్టికొట్టాడని మండిపడ్డారు. 

ఇళ్ల స్థలాల సేకరణ, భూముల చదును పేరుతో వైసీపీ నేతలు వందలకోట్లు మింగేస్తుంటే, నోరెళ్లబెట్టి చూసిన ముఖ్యమంత్రి, పేదలకు ఇళ్లు నిర్మిస్తాడా? అని కాలవ శ్రీనివాసులు ఘాటుగా విమర్శించారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, జగనన్న ఊళ్లు అంటూ ప్రచారం చేసుకున్న జగన్ రెడ్డి, చివరకు వారికి కన్నీళ్లే మిగిల్చాడని అన్నారు.

కాలవ శ్రీనివాసులు నేడు జూమ్ యాప్ ద్వారా మీడియాతో మాట్లాడారు. “మూడున్నరేళ్లలో 18 లక్షల ఇళ్లు కట్టాల్సిన ముఖ్యమంత్రి, కేవలం 5 ఇళ్లు నిర్మిస్తే, జగనన్న కాలనీలు ఎప్పుడు కడతాడు? జగన్మోహన్ రెడ్డి 100 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా, తాను చెప్పిన విధంగా పేదలకోసం 25 లక్షల ఇళ్లు నిర్మించలేడు. పేదలు సొంతిళ్లలో సంతోషంగా ఉంటే, వారిని చూసి ఓర్చుకోలేని తత్వం జగన్ రెడ్డిది. 

చంద్రబాబు హయాంలో పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలాలున్న పేదలకు ఇంటినిర్మాణానికి రూ.2.50 లక్షలు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.1.50 లక్షలు అయితే, కేంద్ర ప్రభుత్వ వాటా లక్షరూపాయలు. నేడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలుచేస్తున్న గృహ నిర్మాణ పథకంలో ప్రభుత్వ వాటా సున్నా అనే చెప్పాలి. ఇంటి నిర్మాణానికి రూ. 1 లక్షా 80 వేలు ఇస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం, దానిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.1.50 లక్షలు కూడా కలిపేసింది.  ఆ లెక్కన జగన్ ప్రభుత్వం అంతిమంగా ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఇచ్చేది కేవలం రూ.30వేలు మాత్రమే. 

టీడీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి రూ.11,414 కోట్లు ఖర్చుపెడితే, మూడున్నరేళ్లలో జగన్ రెడ్డి రూ.3,960 కోట్లు వెచ్చించాడు. ఆ సొమ్ము కూడా వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్లింది. టీడీపీ ప్రభుత్వంలో ఇళ్లు నిర్మించకుంటే, దానికి సంబంధించిన బిల్లులు కూడా ఆపేసిన జగన్ రెడ్డి, పేదలపై కక్షసాధిస్తున్నాడు. త్వరలోనే టీడీపీ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జగనన్న కాలనీల నిర్మాణాన్ని పరిశీలించి, ప్రభుత్వం నిర్మిస్తామని చెబుతున్న ఇళ్లనిర్మాణంలోని డొల్లతనాన్ని బయటపెడతాయి” అని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.

More Telugu News