Jogi Ramesh: నారా లోకేశ్ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి జోగి రమేశ్

  • ఇళ్లు కూలగొట్టడంలో జగన్ గిన్నిస్ లోకి ఎక్కుతాడన్న లోకేశ్
  • ఉనికి కోసమే లోకేశ్ ట్వీట్లు అంటూ జోగి రమేశ్ ఆగ్రహం
  • దమ్ముంటే జగనన్న కాలనీకి రావాలని సవాల్
  • ఇళ్ల నిర్మాణం ఎలా సాగుతుందో చూపిస్తామని వెల్లడి
Jogi Ramesh fires on Nara Lokesh

ఇళ్లు కట్టడం చేతకాదు కానీ... కూలగొట్టమంటే రోజుకు లక్ష ఇళ్లయినా కూలగొట్టి గిన్నిస్ బుక్ ఎక్కేస్తాడు మన జేసీబీ జగన్ రెడ్డి అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్ వేశారు. జగన్ రెడ్డి తన కోసం ఎలహంక, లోటస్ పాండ్, ఇడుపులపాయ, తాడేపల్లి, రుషికొండ ప్యాలెస్ లు మాత్రమే కట్టుకున్నాడని విమర్శించారు. ఏపీలో గత మూడేళ్లలో కేవలం ఐదు ఇళ్లే నిర్మించారని లోక్ సభలో కేంద్రం చెప్పిన వివరాల క్లిప్పింగ్ ను కూడా ట్విట్టర్ లో పంచుకున్నారు.  

దీనిపై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. లోకేశ్ కు దమ్ముంటే జగనన్న కాలనీకి రావాలని సవాల్ విసిరారు. అక్కడ ఇళ్ల నిర్మాణం ఎలా సాగుతుందో చూపిస్తామని స్పష్టం చేశారు. లోకేశ్ పరమ శుంఠ... కళ్లు లేని కబోది... ఉనికిని చాటుకోవడం కోసమే ఇలాంటి ట్వీట్లు చేస్తున్నాడని విమర్శించారు. 

17,000 జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని జోగి రమేశ్ వెల్లడించారు. 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల్లో చూపించే ప్రభుత్వమని ఉద్ఘాటించారు.

More Telugu News