Komatireddy Venkat Reddy: ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ ను కలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy met AICC Chief Mallikarjun Kharge in Delhi
  • ఇటీవల తెలంగాణ పీసీసీ కమిటీల ప్రకటన
  • కోమటిరెడ్డికి ఒక్క కమిటీలోనూ స్థానం దక్కని వైనం
  • రాష్ట్రంలో పరిస్థితులను ఖర్గేకు వివరించిన కోమటిరెడ్డి!
ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ పీసీసీ కమిటీలను ప్రకటించగా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఒక్క కమిటీలోనూ స్థానం దక్కలేదు. కోమటిరెడ్డిని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నేడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ భేటీ సందర్భంగా, రాష్ట్రంలో పరిస్థితిని కోమటిరెడ్డి పార్టీ చీఫ్ ఖర్గేకు వివరించారు. ఇటీవల ప్రకటించిన పీసీసీ కమిటీల్లో పలువురు సీనియర్ల పేర్లు లేకపోవడాన్ని ఖర్గే వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని ఈ సందర్భంగా కోమటిరెడ్డితో ఖర్గే చెప్పినట్టు సమాచారం. 

తెలంగాణ పీసీసీ కమిటీల విషయంలో గత కొన్నిరోజులుగా పార్టీ సీనియర్లలో నిరసన గళాలు వినిపిస్తున్నాయి. తనకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కాకుండా ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కల్పించారంటూ మాజీ మంత్రి కొండా సురేఖ అలకబూనారు. ఆమె ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దామోదర రాజనర్సింహ, బెల్లయ్య నాయక్ కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
Komatireddy Venkat Reddy
Mallikarjun Kharge
New Delhi
TPCC
Congress
Telangana

More Telugu News