Bihar: ఇప్పుడేం జరిగిందంటూ.. అసెంబ్లీలో సహనం కోల్పోయిన బీహార్ సీఎం

  • శీతాకాల సమావేశాల రెండో రోజు అసెంబ్లీలో గందరగోళం
  • చాప్రా కల్తీ మద్యం మృతులపై చర్చ సందర్భంగా రెచ్చిపోయిన సీఎం
  • అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు
  • మద్య నిషేధానికి అందరూ అనుకూలంగా ఉన్నారన్న నితీశ్
Nitish Kumar loses cool in Assembly

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసెంబ్లీలో సహనం కోల్పోయారు. చాప్రాలో కల్తీ మద్యం తాగి 9 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి జరుగుతున్న చర్చలో సీఎం కొంత ఆవేశానికి గురయ్యారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల రెండో రోజు అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు సంధించుకోవడంతో సభ ఒక్కసారిగా గందరగోళంగా మారింది. సభ్యులు వాడివేడిగా మాటల తూటాలు పేల్చారు.

సభ ప్రారంభమైన వెంటనే ఆర్జేడీ-జేడీయూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. ఇటీవల జరిగిన కుర్హానీ ఉప ఎన్నికలో బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ.. కుర్హానీ ట్రైలర్ మాత్రమేనని, తాము బీహార్‌ను గెలుస్తామని నినాదాలు చేశారు. మరోవైపు, ఈ గందరగోళం మధ్య కుర్హానీ నుంచి కొత్తగా ఎన్నికైన కేదార్ గుప్తా ప్రమాణ స్వీకారం పూర్తి  చేశారు. 

ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు చాప్రా కల్తీ మద్యం ఘటనను లేవనెత్తారు. మద్య నిషేధం అమలులో ప్రభుత్వం విఫలమైందని నితీశ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాప్రా ఘటనలో మరణించిన 9 మంది బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఇది నితీశ్‌కు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. ‘‘మద్య నిషేధానికి అందరూ అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడేమైంది. మీరు కల్తీ మద్యం గురించి మాట్లాడుతున్నారు?’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. 

సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది. నిజానికి అసెంబ్లీలో నితీశ్ సహనం కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మార్చిలోనూ నితీశ్ ఇలాగే అప్పటి స్పీకర్‌ విజయ్ సిన్హాపై విరుచుకుపడ్డారు. సభను రాజ్యాంగం ప్రకారం నడపాలని కోరారు. దీంతో స్పీకర్ తన అభిప్రాయాన్ని వివరించే ప్రయత్నం చేయగా సీఎం మరింత ఆగ్రహంతో ఊగిపోతూ స్పీకర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభను ఇలానే నడిపిస్తారా? ఇలాంటివి జరగనివ్వబోమంటూ మండిపడ్డారు.

More Telugu News