sitting: లేవకుండా కూర్చుని పనిచేయడం వల్ల వచ్చే నష్టాలివీ..!

Health experts reveal drawbacks of prolonged sitting
  • రోజులో 8 గంటలకు మించి కూర్చుని పనిచేస్తే ముప్పు
  • 11 గంటలకు మించి కూర్చుని పని చేస్తే 40 శాతం మందస్తు మరణం
  • ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్న వైద్యులు
కూర్చుని గంటల తరబడి.. ఏళ్ల కొద్దీ పనిచేసే వారికి ఆయువు తగ్గుతుందంటే నమ్మతారా? పలు అధ్యయన ఫలితాలను చూస్తే నమ్మాల్సిందే. ఒక రోజులో 11 గంటలు అంతకంటే ఎక్కువ సమయం పాటు కూర్చుని పని చేసే వారు, తదుపరి మూడేళ్ల కాలంలో మరణించే రిస్క్ 40 శాతం ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ఒకటి హెచ్చరించింది. 

ఏడేళ్ల పాటు, రోజూ ఎక్కువ సమయం పాటు కూర్చుని పనిచేయడం వల్ల మరణించే రిస్క్ 11 శాతం పెరుగుతున్నట్టు గుర్తించారు. రోజులో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం పాటు కూర్చుని పనిచేసే మహిళల్లో, ముందుగా మరణించే రిస్క్ 37 శాతం పెరుగుతుందని అమెరికన్ కేన్సర్ సొసైటీ వెల్లడించింది. 2012లో అమెరికాలో నిర్వహించిన మరొక అధ్యయనంలో.. రోజులో 3 గంటల పాటైనా కూర్చుని పనిచేయడాన్ని తగ్గించుకున్న వారికి ఆయుర్ధాయం రెండేళ్ల వరకు పెరుగుతుందని తేలింది.  

ఈ అధ్యయనాలన్నీ కూడా.. ఎక్కువ సమయం పాటు కూర్చుని పనిచేస్తే ఆరోగ్యానికి ముప్పు అని హెచ్చరిస్తున్నాయి. మన శరీరంలో 600 కు పైగా కండరాలు ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలు సౌకర్యంగా, సజావుగా సాగేందుకు ఇవి ఆరోగ్యంగా ఉండాలి. ఒక సమన్వయంతో పనిచేయాలి. సరైన భంగిమలో కూర్చోకపోవడం వల్ల, దీనికి ఒత్తిడి తోడు కావడం వల్ల అది కండరాలపై భారం పెంచుతుంది. దీన్నే రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజూరీ అని అంటారు. 

రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజూరీ (అదే పనిగా ఒత్తిడి వల్ల గాయాలు) వల్ల కండరాలు దెబ్బతింటాయి. ఇది మరింత అసౌకర్యం, నొప్పికి దారితీస్తుంది. దీన్ని నయం చేసుకోకపోతే మైయోఫాజియల్ పెయిన్స్ కింద మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరాల్లో ఉద్యోగ జీవనం, కార్యాలయాల్లో 8 గంటలకు మించి పనిచేయడం వల్ల.. మెడ నొప్పి, భుజం నొప్పి, స్థూలకాయం, ఒత్తిడి, నడుం నొప్పి సమస్యలు కనిపిస్తాయి.

అధిక సమయం పాటు కూర్చోవడం వల్ల.. ముఖ్యంగా నడుం కింది భాగంలో ఒత్తిడి అధికంగా పడుతుంది. దీనివల్ల కొంత కాలానికి కాళ్లలో సామర్థ్యం తగ్గిపోతుంది. బలహీనత కనిపిస్తుంది. మన తల బరువు 5 కిలోలు ఉంటుంది. తలను ముందుకు వంచి ఎక్కువ సమయం పాటు పనిచేయడం వల్ల.. మెడ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. తల కింద పడకుండా ఉండేందుకు మెడ కండరాలు సపోర్ట్ ను ఇస్తాయి. అందుకే ఎక్కువ సమయం పాటు ఇలా పనిచేయడం వల్ల మెడ నొప్పి వస్తుంది.
sitting
prolonged
health problems
drawbacks
Health experts

More Telugu News