West Bengal: బెంగాల్ అలర్ల నిందితుడి కస్టోడియల్ డెత్.. సీబీఐ అధికారులపై హత్య కేసు నమోదు

  • ఈ ఏడాది మొదట్లో బీర్భూమ్‌లో హింస
  • మహిళ, చిన్నారులు సహా 10 మంది మృతి
  • ప్రధాన నిందితుడు లలన్ సింగ్‌ను ఈ నెల 4న ఝార్ఖండ్‌లో అరెస్ట్ చేసిన సీబీఐ
  • కస్టడీలో ఉండగా సోమవారం మృతి
  • లలన్ పేరును కేసు నుంచి తొలగించేందుకు సీబీఐ అధికారులు రూ. 50 లక్షలు డిమాండ్ చేశారన్న లలన్ భార్య
  • ఎఫ్ఐఆర్‌పై కలకత్తా హైకోర్టుకు సీబీఐ?
Murder Case Against CBI Officials Over Death Of Bengal Violence Accused

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్‌లో జరిగిన అల్లర్ల కేసు ప్రధాన నిందితుడు సీబీఐ కస్టడీలో మృతి చెందిన ఘటనపై దర్యాప్తు సంస్థ అధికారులపై కోల్‌కతా పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో ఈ ఏడాది మొదట్లో చోటుచేసుకున్న హింస కేసులో లలన్ షేక్ ప్రధాన నిందితుల్లో ఒకడు. సీబీఐ కస్టడీలో ఉన్న లలన్ షేక్ సోమవారం మృతి చెందాడు. దీంతో సీబీఐ సీనియర్ అధికారులపై పోలీసులు హత్యకేసు నమోదు చేశారు. అయితే, ఈ ఎఫ్ఐఆర్‌ను దర్యాప్తు సంస్థ కలకత్తా హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

బీర్భూమ్ హింసలో ఓ మహిళ, చిన్నారులు సహా 10 మంది సజీవ దహనమయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న లనన్‌ను ఈ నెల 4న ఝార్ఖండ్‌లో అరెస్ట్ చేశారు. జిల్లాలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన క్యాంపులో లలన్‌ను సీబీఐ అధికారులు ఉంచి విచారిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అతను మృతి చెందాడు. 

సీబీఐ అధికారులు చిత్ర హింసలకు గురిచేయడం వల్లే లలన్ మరణించాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసు నుంచి తన భర్త పేరును తొలగించేందుకు సీబీఐ అధికారులు రూ. 50 లక్షలు డిమాండ్ చేసినట్టు లలన్ భార్య ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను సీబీఐ తోసిపుచ్చింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు లలన్ మృతిపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. కాగా, బొగ్తుయ్‌లోని ఇళ్లకు నిప్పు పెట్టిన గుంపునకు షేక్ నాయకత్వం వహించినట్టు ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని అంతకుముందు తీవ్రంగా హింసించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది.  

స్థానిక టీఎంసీ నేత భడుషేక్ మరణం తర్వాత గ్రామంలో ఈ హింస చోటుచేసుకుంది. అయితే, ఈ హత్యకు భూ లావాదేవీలు, అక్రమ వ్యాపారం, దోపిడీ సొమ్ములో వాటా విషయంలో భడుషేక్‌కు ఆయన సహచరులకు మధ్య ఏర్పడిన వైరమే కారణమని కోర్టుకు సమర్పించిన చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది.

More Telugu News