Yanamala: ఏపీకి అన్ని దారులు మూసుకుపోయాయి: యనమల

  • జగన్ పాలనలో ఏపీ దివాలా తీసిందన్న యనమల
  • పథకాలు కూడా కొనసాగించలేరని వెల్లడి
  • పరిమితికి మించి అప్పులు తెచ్చారని ఆరోపణ
  • కొత్త అప్పులకు కేంద్రం అనుమతించడంలేదని వ్యాఖ్యలు
Yanamala criticizes CM Jagan administration

జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధికంగా దివాలా తీసిందని, భవిష్యత్తులో సంక్షేమ పథకాలను కూడా కొనసాగించలేని స్థితికి రాష్ట్రం చేరుకుంటోందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. జగన్ రెడ్డి అసమర్ధత కారణంగా రాష్ట్రం ఆర్ధికంగా బలోపేతమవడానికి ఉన్న అన్ని దారులు మూసుకుపోయాయని, పరిమితి కంటే ఎక్కువ అప్పులు తీసుకోవడంతో కేంద్రం కూడా అదనపు అప్పులు తెచ్చుకునేందుకు అనుమతివ్వడంలేదని అన్నారు. స్పెషల్ డ్రాయింగ్ అలవెన్స్ కూడా రేపోమాపో మూసుకుపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. 

"క్లిష్టమైన పరిస్థితులలో వాడుకునే ఓవర్ డ్రాప్ట్ (ఓడీ) గత ఏడాది 136 రోజులు తీసుకున్నారు. ఈ ఏడాది ఓడీకి వెళ్లకుంటే పని జరిగే పరిస్థితి లేదు. ఒకసారి ఓడీ తీసుకుంటే దాన్ని 14 రోజుల లోపు చెల్లించాలి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఓడీ ఇప్పటికే 12 రోజులు పూర్తయినాయి. ఇక జగన్ ప్రభుత్వానికి మిగిలింది కేవలం 2 రోజులు మాత్రమే. ఈ రెండు రోజుల్లో ఓడీ చెల్లించకపోతే ఆర్బీఐలో రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలన్నీ మూసేస్తారు. 

ఇది సంభవిస్తే దేశంలోనే ఆర్ధికంగా అత్యంత క్లిష్టపరిస్థితిల్లోకి వెళ్లిన రాష్ట్రంగా ఏపీ నిలుస్తుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆర్బీఐ 9వ తారీఖు నోటీసు ఇచ్చినట్లు కూడా సమాచారం. ఆర్బీఐ రాసిన లేఖను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడంలేదో చెప్పాలి" అని నిలదీశారు. 

అప్పులలో ఉన్న వృద్ధి రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో కనపడటం లేదని యనమల విమర్శలు గుప్పించారు. "అప్పుల వృద్ధి ఈ ప్రభుత్వం హయాంలో 37.5 శాతంగా ఉంది. కానీ, ఆ మేరకు రాష్ట్ర స్థూల ఆదాయం మాత్రం పెరగడం లేదు. 1956 నుంచి 2019 వరకు 60 ఏళ్లలో ఏపీ ప్రభుత్వాలు చేసిన అప్పు 2.57 లక్షల కోట్లు. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో 7 లక్షల కోట్లు అప్పులు చేసింది. 

మూడున్నరేళ్లలో రాష్ట ప్రభుత్వ ఆదాయం సరాసరిన 10 శాతం మాత్రమే వృద్ధి ఉంది. అప్పుల వృద్ధి మాత్రం 37.5 శాతం ఉంది. దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్దిక వ్యవస్థను కుదేలు చేసినట్లు స్పష్టంగా కనపడుతోంది. దీన్ని ప్రజలు గుర్తించాలి. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి చూస్తుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 360ని ప్రయోగించి ఆర్ధిక అత్యవసరపరిస్థితి విధించే పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం దీనిపై వెంటనే స్పందించాలి" అని యనమల విజ్ఞప్తి చేశారు.

More Telugu News