Uttarakhand: కుమార్తె మెహందీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ మరణించిన తండ్రి.. వధువుకు తెలియకుండా పెళ్లి!

Brides father dies while dancing day before wedding in Uttarakhand
  • డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వధువు తండ్రి మృతి
  • పుట్టెడు దుఃఖంతోనే పెళ్లి జరిపించిన వైనం
  • కన్యాదానం చేసిన మేనమామ
  • తండ్రి గురించి అడిగిన వధువుకు ఆసుపత్రికి వెళ్లారని చెప్పిన కుటుంబ సభ్యులు
కుమార్తె మెహందీ ఫంక్షన్‌లో ఆనందంగా నృత్యం చేస్తూ తండ్రి గుండెపోటుతో మరణించాడు. అయితే, ఆ విషయాన్ని వధువుకు తెలియకుండా కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో జరిగిందీ ఘటన. ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా శనివారం రాత్రి వధువు ఇంట్లో మెహందీ వేడుక నిర్వహించారు. వేడుకలో వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

అయితే, ఈ విషయం కుమార్తెకు చెబితే పెళ్లి ఆగిపోతుందని భావించిన కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖాన్ని గుండెలోనే దాచిపెట్టుకుని ఆదివారం హల్ద్వానీలోని ఓ ఫంక్షన్‌ హాలులో వివాహం జరిపించారు. కన్యాదానాన్ని వధువు తండ్రి కాకుండా మేనమామ నిర్వహించేందుకు రావడంతో వధువు నిరాకరించింది. ఆరోగ్యం బాగాలేకపోవడంతో పరీక్షల కోసం ఆయన ఆసుపత్రికి వెళ్లారని, వచ్చేస్తారని చెప్పి కన్యాదానం జరిపించారు.
Uttarakhand
Wedding
Bride
Almora
Mehendi Function

More Telugu News