Revanth Reddy: నేను శూద్రుడ్ని, నాకు స్వచ్ఛమైన హిందీ రాదు... నిర్మల గారు బ్రాహ్మణవాది, మంచి హిందీ మాట్లాడతారు: రేవంత్ రెడ్డి

  • లోక్ సభలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు
  • నిర్మల, రేవంత్ మధ్య వాదోపవాదాలు
  • నిర్మల వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చిన రేవంత్
Revanth Reddy hits out Nirmala Sitharaman Hindi language remarks

తెలంగాణ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటులో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను శూద్రుడ్ని అని, తనకు స్వచ్ఛమైన హిందీ రాదని, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బ్రాహ్మణవాది అని ఆమెకు స్వచ్ఛమైన హిందీ వచ్చని పేర్కొన్నారు. 

అసలేం జరిగిందంటే... అమెరికా డాలర్ తో పోల్చితే మన రూపాయి అంతకంతకు పడిపోతోందని, దీనిపై కేంద్రం ఏం చర్యలు తీసుకుంటోందని లోక్ సభలో రేవంత్ రెడ్డి నిలదీశారు. అందుకు నిర్మల సీతారామన్ స్పందిస్తూ, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంటే కొందరికి అసూయ కలుగుతోందని, దేశ ప్రగతిని జోక్ గా తీసుకుంటున్నారని విమర్శించారు. 

ఈ సందర్భంగా వాదోపవాదాలు జరిగాయి. తెలంగాణ నుంచి వచ్చిన గౌరవ సభ్యుడు తక్కువస్థాయి హిందీలో మాట్లాడుతున్నాడని, అతడికి జవాబిచ్చేందుకు తాను కూడా తక్కువ స్థాయి హిందీలోనే మాట్లాడుతున్నానని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ పైవిదంగా ఘాటుగా బదులిచ్చారు.

అంతేకాదు ఆమె తీరును ట్విట్టర్ వేదికగా ఖండించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో మాట్లాడిన భాష చిచ్చుపెట్టేలా ఉందని, ఆమె వైఖరి విచారకరం అని రేవంత్ ఓ ట్వీట్ లో తెలిపారు. బ్రిటీష్ వారి మాదిరిగానే బీజేపీ కూడా ఎల్లప్పుడూ విభజించి పాలించే రాజకీయాలను అనుసరిస్తుందని విమర్శించారు. వారు దేశ ప్రజలను భాష, ఆహారం, కులం, మతం ఆధారంగా విభజించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

More Telugu News