YSRTP: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వైఎస్ షర్మిల

  • జూబ్లీహిల్స్ అపోలో నుంచి లోటస్ పాండ్ లోని ఇంటికి వెళ్లిన షర్మిల
  • ప్రజా ప్రస్థానం యాత్రకు అనుమతి ఇవ్వాలంటూ ఆమె చేసిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు
  • రెండు రోజులు ఆసుపత్రిలో ఉన్న షర్మిల
YS Sharmila discharged from hospital

వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. తమ ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ షర్మిల చేపట్టిన దీక్షను శనివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి షర్మిల చికిత్స తీసుకోగా.. సోమవారం ఉదయం ఆమె డిశ్చార్జ్  అయ్యారు. రెండు, మూడు వారాలు షర్మిలకు విశ్రాంతి అవసరమని వైదులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆమె కొన్ని రోజులు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోనున్నారని తెలుస్తోంది. 

కాగా, ఆసుపత్రిలో షర్మిలను ఆమె తల్లి విజయమ్మ పరామర్శించారు. అనంతరం ఆసుపత్రి బెడ్ నుంచి షర్మిల ఓ వీడియో విడుదల చేశారు. హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతి నిచ్చినా, సీఎం కేసీఆర్ మాత్రం పోలీసు భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారని ఆరోపించారు.  ‘వైఎస్ఆర్  బిడ్డను పంజరంలో పెట్టి బంధించాలనుకోవడం కేసీఆర్ తరం కాదు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రజలకు అందించే వరకు ఈ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు.

More Telugu News