India: కిక్కిరిసిన స్టేడియంలో కోహ్లీలా చెలరేగి.. భారత్​ ను గెలిపించిన మంధాన

  • ఆస్ట్రేలియాతో రెండో టీ20లో సూపర్ ఓవర్లో భారత్ ఉత్కంఠ విజయం
  • ఛేజింగ్, సూపర్ ఓవర్లో అద్భుతంగా ఆడిన స్మృతి మంధాన
  • మ్యాచ్ కు హాజరైన 47 వేల మంది ప్రేక్షకులు
Smriti Mandhana and Richa Ghosh power India to series equaliser

భారత మహిళ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మరోసారి తన బ్యాట్ పవర్ చూపెట్టింది. విరాట్ కోహ్లీ ఆటను తలపించేలా లక్ష్య ఛేదనలో అసాధారణ ఆట తీరు కనబరిచింది. దాంతో, ముంబైలో 47 వేల ప్రేక్షకులతో కిక్కిరిసిన డీవై పాటిల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20లో భారత మహిళల జట్టు సూపర్ ఓవర్లో ఆస్ట్రేలియాను ఓడించింది. ఐదు మ్యాచ్ల సిరీస్ ను 1–1తో సమం చేసింది. ఈ ఏడాది ఆసీస్ జట్టుకు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. తొలుత టాస్ ఓడి బ్యాటింగుకు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 187/1 స్కోరు చేసింది. బెత్ మూనీ (54 బంతుల్లో 13 ఫోర్లతో 82 నాటౌట్), తాహ్లియా  (51 బంతుల్లో 10 ఫోర్లతో 1 సిక్స్ తో 70 నాటౌట్) దంచికొట్టారు. 

అనంతరం ఛేదనలో భారత్ కూడా 20 ఓవర్లలో 187/5 స్కోరు చేసింది. స్మృతి మంధాన (49 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 79) చెలరేగింది. షెఫాలీ వర్మ (34), రిచా ఘోష్ (26 నాటౌట్) మెరుపులు మెరిపించారు. భారత్ విజయానికి ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరం అవగా.. దేవికా వైద్య (11 నాటౌట్) ఫోర్ కొట్టడంతో స్కోర్లు సమం అయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది.

విజేతను తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్లో భారత్ 20/1 స్కోరు చేసింది. తొలి బంతికి రిచా ఘోష్ సిక్స్ కొట్టగా..  మంధాన 6, 4 తో పాటు ఆఖరి బంతికి 3 పరుగులు రాబట్టింది. అనంతరం రేణుకా సింగ్ వేసిన ఓవర్లో ఆస్ట్రేలియా 16/1 స్కోరుకే పరిమితమైంది. స్మృతికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత్ లో మహిళల మ్యాచ్ కు స్టేడియం మొత్తం నిండిపోయేలా 45 వేల పైచిలుకు ప్రేక్షకులు హాజరవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దాంతో, మ్యాచ్ ముగిసిన తర్వాత మహిళలు భారత జెండా పట్టుకొని మైదానం మొత్తం తిరుగుతూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News