Orion Space Capsule: నేడు పసిఫిక్ మహాసముద్రంలో పడనున్న నాసా స్పేస్ కాప్సూల్

  • నవంబరు 16న ఆర్టెమిస్ ప్రయోగం
  • చంద్రుడిపైకి మానవుల రవాణా అవకాశాల పరిశీలన
  • నేడు భూ వాతావరణంలోకి ఓరియన్ కాప్సూల్
  • గంటకు 40 వేల కిమీ వేగంతో దూసుకొస్తున్న కాప్సూల్
NASA Orion space capsule will drop down in Pacific Ocean today

చంద్రుడిపైకి మానవుల రవాణా అవకాశాల పరిశీలన నిమిత్తం నాసా ఆర్టెమిస్-1 మిషన్ ను గత నవంబరు 16న చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయోగించిన ఓరియన్ స్పేస్ కాప్సూల్ నేడు భూ వాతావరణంలో తిరిగి ప్రవేశించనుంది. ఈ కాప్సూల్ పసిఫిక్ మహాసముద్రంలో పడనుంది. 

ఆర్టెమిస్-1 మిషన్ లో భాగంగా చివరి దశ యాత్రను పూర్తి చేసుకున్న ఓరియన్ స్పేస్ కాప్సూల్ భూమికి తిరిగివస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.40 గంటలకు ఇది సముద్రంలో పడుతుందని నాసా అంచనా వేస్తోంది. 

ఈ కాప్సూల్ భూమికి తిరిగి వచ్చే ప్రకియ వారం కిందటే ప్రారంభమైంది. ఇందులోని ఇంజిన్ల శక్తిమంతమైన కదలికల కారణంగా, స్పేస్ కాప్సూల్ దిశ మారింది. దాంతో చంద్రుడి ఉపరితలం నుంచి భూమి వైపు పయనించడం ప్రారంభించింది. 

ఇది భూమికి తిరిగి వచ్చే సమయంలో గంటకు 40 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకురానుంది. భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత గరిష్ఠ వేగాన్ని అందుకుంటుందని భావిస్తున్నారు. అయితే పసిఫిక్ మహాసముద్రంలో పడే సమయానికి దీని వేగాన్ని గంటకు 32 కిలోమీటర్లకు నియంత్రించనున్నారు. ఇది మెక్సికో సమీపంలో బజా కాలిఫోర్నియా తీరంలో పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News