Sharmila: షర్మిల ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసిన అపోలో ఆసుపత్రి

  • లోటస్ పాండ్ నివాసం వద్ద షర్మిల దీక్ష
  • గత అర్ధరాత్రి భగ్నం చేసిన పోలీసులు
  • అపోలో ఆసుపత్రికి తరలింపు
  • రేపు ఉదయంలోపు డిశ్చార్జి అయ్యే అవకాశం
  • పూర్తి విశ్రాంతి అవసరమంటున్న వైద్యులు

Apollo Hospital releases Sharmila health bulletin

హైదరాబాదులోని తన నివాసం వద్ద దీక్ష చేస్తున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు బలవంతంగా అపోలో ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, షర్మిల ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి యాజమాన్యం తాజా బులెటిన్ విడుదల చేసింది. 

గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో షర్మిలను ఆసుపత్రికి తీసుకువచ్చారని, ఆ సమయంలో షర్మిల తక్కువ రక్తపోటు, నీరసం, తల తిరగడం, డీహైడ్రేషన్, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, తీవ్రస్థాయి ఒలిగురియా, హై ఆనియన్ గ్యాప్ మెటాబాలిక్ యాసిడోసిస్, ప్రీ రీనల్ అజోటెమియా వంటి లక్షణాలతో బాధపడుతున్నారని వెల్లడించింది.

ప్రస్తుతం షర్మిలకు చికిత్స అందిస్తున్నామని, చికిత్సకు ఆమె తగిన విధంగా స్పందిస్తున్నారని అపోలో ఆసుపత్రి తెలిపింది. ఈ సాయంత్రం కానీ, రేపు ఉదయం కానీ ఆమెను డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. అంతేకాదు, షర్మిల పూర్తిగా కోలుకోవాలంటే డిశ్చార్జి అయిన తర్వాత రెండు, మూడు వారాలు సంపూర్ణ విశ్రాంతి అవసరమని స్పష్టం చేసింది.

More Telugu News