Blast: నిజామాబాద్ పట్టణంలో రాత్రి పేలుడు కలకలం.. కారణం ఇదే!

  • పట్టణంలోని బడా బజార్ ప్రాంతంలో శనివారం రాత్రి భారీ శబ్దంతో పేలుడు
  • మంటలు వ్యాపించి దెబ్బతిన్న మూడు దుకాణాలు
  • రసాయనాలు ఉన్న డబ్బాను కదిలించడంతో పేలిందని ప్రాధమిక నిర్ధారణ
Blast in Telangana Nizamabad after man shakes box of chemicals say cops

నిజామాబాద్ పట్టణంలో పేలుడు సంభవించడం కలకలం సృష్టించింది. పట్టణంలోని బడా బజార్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో ఓ వ్యక్తికి తీవ్ర గాయలయ్యాయి. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గాయపడ్డ వ్యక్తిని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి  నిలకడగా ఉంది. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చెత్త ఏరుకునే వ్యక్తి తీసుకొచ్చిన రసాయన పదార్థాలు ఉన్న ఓ డబ్బాను కదిలించడంతో అది పేలిపోయిందని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే, రసాయనిక చర్య కారణంగానే పేలుడు జరిగిందా? వేరే కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు పేలుడు కారణంగా ఒక్క సారిగా మంటలు వ్యాపించాయి. దాంతో, ఓ వైన్ షాపు సహా మూడు దుకాణాలు దెబ్బతిన్నాయి.   ఫైర్ ఇంజన్లు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. పేలుడు గురించి తమకు సమాచారం అందిందని వన్ టౌన్ పోలీసులు తెలిపారు. రసాయనాల పెట్టెను కదిలించినప్పుడు పేలుడు జరిగిందని ఈ సంఘటనలో గాయపడిన వారు తెలిపారని చెప్పారు. ఘటనా స్థలానికి పోలీసుల బృందం చేరుకొని సాక్ష్యాలను సేకరించింది.

More Telugu News