సాకర్​ ప్రపంచకప్​లో కేక పుట్టిస్తున్న ఫ్రాన్స్ .. మరో ట్రోఫీకి చేరువ

  • క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ పై 2–1 తేడాతో గెలుపు
  • ఏడోసారి సెమీఫైనల్ చేరిన ఫ్రాన్స్
  • ఏడుసార్లు క్వార్టర్ పైనల్లోనే వైదొలిగిన ఇంగ్లిష్ జట్టు
Defending Champions France Beat England To Reach Semi Finals

ఫిఫా ప్రపంచ కప్ లో గత టోర్నీ విజేత ఫ్రాన్స్ జట్టు జోరు కొనసాగుతోంది. వరసగా రెండో సారి ఫుట్ బాల్ వరల్డ్ చాంపియన్ అయ్యేందుకు ఆ జట్టు మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఖతార్ లో జరుగుతున్న తాజా టోర్నీలో ఆ జట్టు సెమీ ఫైనల్ చేరుకుంది. శనివారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించి ముందంజ వేసింది. ఫ్రాన్స్ తరఫున 17వ నిమిషంలో ఆరెలిన్, 78వ నిమిషంలో ఒలీవియర్ గిరౌడ్ గోల్స్ సాధించాడు. ఇంగ్లండ్ తరఫున కెప్టెన్ హ్యారీ కేన్ 54వ నిమిషంలో దక్కిన పెనాల్టీని గోల్ గా మలిచాడు. మ్యాచ్ అయితే, 84వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కిక్కు హ్యారీ కేన్ గోల్ చేయడంలో విఫలం కావడంతో ఇంగ్లండ్ కు ఓటమి తప్పలేదు. 
 
ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడం ఇది ఏడోసారి. మరోవైపు ఈ మెగా టోర్నీలో ఫ్రాన్స్ జట్టు ఏడోసారి సెమీఫైనల్ చేరుకుంది. వరుసగా రెండు పర్యాయాలు సెమీస్ చేరడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. ఇక, బుధవారం రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం రాత్రి జరిగే తొలి సెమీస్ లో అర్జెంటీనా, క్రొయేషియా జట్లు తలపడుతాయి. ఆదివారం జరిగే ఫైనల్ తో ఈ టోర్నీ ముగుస్తుంది.

More Telugu News