cji: పిల్లలపై లైంగిక నేరాలు.. సీజేఐ ఏమన్నారంటే..!

NO MORE SILENCE ON SEXUAL ASSAULT SAYS CJI CHANDRACHOOD
  • ఇంట్లో వాళ్లు వేధించినా సరే కేసు పెట్టాల్సిందేనని వ్యాఖ్య
  • కుటుంబం పరువుకంటే చిన్నారుల రక్షణే ముఖ్యమన్న సీజేఐ
  • మైనర్ల అంగీకారంతో జరిగినా అది అత్యాచారమేనని వెల్లడి
పసిపిల్లలపై లైంగిక నేరాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కేసులు చాలావరకు వెలుగులోకి రావడంలేదని, బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ దాకా రావడంలేదని చెప్పారు. పోక్సో చట్టంపైన ఢిల్లీలో జరుగుతున్న రెండు రోజుల జాతీయ సదస్సును సీజేఐ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. చిన్నారులపై లైంగిక దాడుల విషయంలో ఎక్కువశాతం కుటుంబంలోని వ్యక్తులే నిందితులని చెప్పారు. దీంతో కుటుంబం పరువు పోతుందని ఆ వ్యవహారాన్ని బయటకు వెల్లడించడంలేదన్నారు.

పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్న సీజేఐ.. లైంగిక దాడికి పాల్పడ్డ వ్యక్తి ఎవరైనా సరే కేసు పెట్టాలని సూచించారు. కుటుంబం పరువు పోతుందనో.. అవమానంతోనో బయటకు చెప్పకుండా ఉంటే వేధింపులు పెరుగుతాయని హెచ్చరించారు. కుటుంబం పరువు కన్నా చిన్నారుల రక్షణే ముఖ్యమని తల్లిదండ్రులకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. పిల్లలపై వేధింపులను సరైన సమయంలోనే గుర్తించాలని, ఇందుకు పిల్లలకు సేఫ్, అన్ సేఫ్ టచ్ గురించి అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు. 

మైనర్లు లైంగిక వేధింపులకు గురైతే పోలీసులను ఆశ్రయించేలా ప్రజలను చైతన్యపరచాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. పద్దెనిమిదేళ్లలోపు పిల్లల అంగీకారంతో లైంగికంగా కలిసినప్పటికీ అది నేరమేనని సీజేఐ స్పష్టం చేశారు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేస్తారని సీజేఐ వివరించారు.
cji
sexual harassment
pocso
minors
kids
family

More Telugu News