manneguda kidnap: మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. తమకు పెళ్లయిందంటున్న నవీన్.. డ్రామా అంటున్న యువతి తండ్రి

  • గతేడాదే తమకు పెళ్లయిందన్ననవీన్ రెడ్డి
  • బాపట్ల జిల్లా వలపర్ల లోని ఓ గుడిలో వివాహం చేసుకున్నట్లు వెల్లడి
  • చదువు పూర్తయ్యేదాకా రహస్యంగా ఉంచాలని ఆమె కోరిందని వివరణ
  • తన డబ్బుతో ఆమె ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేసిందని ఆరోపణ 
  • అన్నీ నిరాధార ఆరోపణలేనని కొట్టిపారేసిన యువతి తండ్రి
Big twist in manneguda women vaishali kidnap case

మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసు మలుపులు తిరుగుతోంది. వందమంది యువకులు మన్నెగూడలోని ఆమె ఇంటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కిడ్నాప్ వ్యవహారంలో వేగంగా స్పందించిన పోలీసులు.. కిడ్నాప్ లో ప్రధాన నిందితుడిని నవీన్ రెడ్డిగా గుర్తించారు. నల్గొండ నుంచి విజయవాడ వైపు వెళుతుండగా నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని, యువతిని కాపాడారు. అయితే, ఆ యువతితో తనకు గతేడాదే పెళ్లి జరిగిందని, బాపట్లలోని వలపర్ల ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యామని నవీన్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు.

నవీన్ రెడ్డి స్టేట్ మెంట్ లో ఏముందంటే..
2021 జనవరి నుంచి ఆమె, తను ప్రేమలో ఉన్నామని నవీన్ రెడ్డి స్టేట్ మెంట్ లో పేర్కొన్నాడు. గతేడాది ఆగస్టు 4న బాపట్ల జిల్లా వలపర్ల లోని గుడిలో తాము పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. వివాహానికి సంబంధించిన ఫొటోలను తన చదువు పూర్తయ్యే వరకు బయట పెట్టొద్దని ఆమె కోరిందన్నాడు. అందుకే తన పెళ్లి ఫొటోలను రహస్యంగా ఉంచానని నవీన్ రెడ్డి వివరించాడు. తమ ప్రేమను ఆమె కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారని, ఆమె చదువయ్యాక తమ పెళ్లి చేస్తామని చెప్పారన్నారు. 

ఆమె కుటుంబం తనతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టించారని నవీన్ రెడ్డి చెప్పాడు. కుటుంబంతో సహా వాళ్లంతా తన డబ్బుతో వైజాగ్, అరకు, వంజంగి, కూర్గ్, మంగుళూరు, గోకర్ణ, గోవా తదితర టూర్లకు వెళ్లొచ్చారని ఆరోపించాడు. ఆమె పేరు మీద వోల్వో కారు, ఆమె తండ్రి పేరు మీద రెండు కాఫీ షాపులను రిజిస్ట్రేషన్ చేయించినట్టు వివరించాడు. అయితే, ఇప్పుడు ఆమెకు మరో యువకుడితో పెళ్లి చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారని నవీన్ రెడ్డి చెప్పాడు.

నవీన్ సైకోలా వ్యవహరించాడు: యువతి తండ్రి
తన కూతురు విషయంలో నవీన్ రెడ్డి సైకోలాగా వ్యవహరించాడని ఆమె తండ్రి దామోదర్ రెడ్డి ఆరోపించారు. బొంగ్లూరులోని ఓ బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రంలో నవీన్ తో తన కూతురుకి పరిచయం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి తన కూతురును ప్రేమ పేరుతో నవీన్ వేధిస్తూనే ఉన్నాడని ఆరోపించారు. శుక్రవారం యాభై మందికి పైగా యువకులతో వచ్చి నవీన్ రెడ్డి తన ఇంటిపై దాడి చేశాడన్నారు. 

తన కూతురును సొంతం చేసుకోవాలని నవీన్ ఎన్నో నాటకాలు ఆడాడడని, ఆమెతో పెళ్లి జరిగిందనడం కూడా అందులో ఒకటని చెప్పారు. పెళ్లి జరిగిందని చెబుతున్న రోజున ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉందని, ఆ రోజు పెళ్లి జరిగిందనడం డ్రామా అని వివరించారు. నవీన్ రెడ్డిని తన కూతురు పెళ్లి చేసుకోలేదని దామోదర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలతో నవీన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ రెడ్డిపై కిడ్నాప్, మర్డర్ అటెంప్ట్ సహా పలు సెక్షన్ల కింద ఆదిభట్ల పోలీసులు కేసులు నమోదు చేశారు.

More Telugu News