Jada Sravan: జగన్ పై బొత్స, ధర్మాన చేసిన విమర్శలతో పోల్చుకుంటే డాక్టర్ సుధాకర్ అంశం చాలా చిన్నది: 'జైభీమ్ భారత్ పార్టీ' అధ్యక్షుడు శ్రవణ్ కుమార్

Dr Sudhakars issue is very minor compared to Botsa and Dharmanas criticism of Jagan says Jada Sravan
  • డాక్టర్ సుధాకర్ ను వైసీపీ ప్రభుత్వం చంపేసిందన్న జడ శ్రవణ్
  • పోలీసులు వైసీపీ కండువా కప్పుకుని ఉద్యోగం చేస్తున్నారని విమర్శ
  • తమ సభను అడ్డుకున్న ఏ పోలీస్ అధికారినీ వదలబోమని హెచ్చరిక

డాక్టర్ సుధాకర్ పై రాష్ట్ర ప్రభుత్వం పిచ్చివాడిగా ముద్ర వేసి చంపేసిందని జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ విమర్శించారు. సుధాకర్ పట్ల విశాఖ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుధాకర్ తల్లికి ఈ ప్రభుత్వం చేసిన అన్యాయం పూడ్చలేనిదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతో పాటు పలువురు నేతలు గతంలో చేసిన విమర్శలతో పోల్చుకుంటే... ప్రభుత్వాన్ని డాక్టర్ సుధాకర్ ప్రశ్నించడం చాలా చిన్న విషయమని చెప్పారు.

విశాఖలో తాను తలపెట్టిన సభకు 'డాక్టర్ సభా వేదిక' అని పేరు పెట్టామని... సభ కోసం అక్టోబర్ లోనే అనుమతిని కోరామని... పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. కోర్టు అనుమతులు ఇచ్చినప్పటికీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా నిన్న రాత్రి సభ పెట్టడానికి అనుమతి లేదని చెప్పారని మండిపడ్డారు. పోలీసులు వైసీపీ కండువా కప్పుకుని ఉద్యోగం చేస్తున్నారని విమర్శించారు. 

హైకోర్టు ఆదేశాలను గౌరవించాలనే విషయం కూడా పోలీసులకు తెలియదా? అని శ్రవణ్ ప్రశ్నించారు. శాంతిభద్రతల కారణంగా అనుమతి ఇవ్వడం లేదని చెప్పడం దారుణమని అన్నారు. సభకు డాక్టర్ సుధాకర్ పేరు పెట్టడం ఇబ్బందికరమైతే... ఆ పేరును తొలగిస్తామని చెప్పడం కూడా జరిగిందని తెలిపారు. తమ సభను అడ్డుకున్న ఏ పోలీస్ అధికారినీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. పోలీసులా? రాజ్యాంగమా? తేల్చుకుందామని సవాల్ విసిరారు. అరకులో ఈరోజు నిర్వహిస్తున్న డాక్టర్ సుధాకర్ స్మారక సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News