kerala high court: ఏడాది ఎందుకు ఆగాలి?: విడాకుల కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

  • దంపతులు ఇరువురూ సుముఖంగా ఉన్నా ఏడాది పాటు ఆగడం అన్నది రాజ్యాంగ విరుద్ధమన్న హైకోర్టు 
  • న్యాయం పొందే హక్కును చట్టబద్ధమైన నిబంధనలు అడ్డుకోవడం ఉల్లంఘనేనని వ్యాఖ్య 
  • క్రిస్టియన్ల విషయంలో భారత విడాకుల చట్టంలోని నిబంధనలను తప్పుపట్టిన కోర్టు 
  • ఓ క్రిస్టియన్ జంట కేసులో ఫ్యామిలీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు 
One year wait for seeking divorce by mutual consent violates fundamental rights Kerala HC

ఒక విడాకుల కేసులో కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. విడాకుల చట్టం కింద.. పరస్పర సమ్మతితో విడాకులు తీసుకునేందుకు ఏడాది పాటు వేర్వేరుగా ఉండాలనడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. జస్టిస్ ఏ మహమ్మద్ ముస్తక్, జస్టిస్ శోభ అన్నమ్మ ఈపెన్ తో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పరస్పరం విడాకులు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నా, అందుకు ఏడాది పాటు వేచి చూడాలనడం పౌరుల స్వేచ్ఛా హక్కుకు విరుద్ధమని పేర్కొంది. ముఖ్యంగా క్రిస్టియన్ల విషయంలో భారత విడాకుల చట్టంలోని నిబంధనలను ధర్మాసనం తప్పుబట్టింది. 

క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం ఈ ఏడాది మొదట్లో పెళ్లి చేసుకున్న ఓ జంట విడిపోవాలనుకుంది. మే నెలలో ఫ్యామిలీ కోర్టులో విడాకుల చట్టంలోని సెక్షన్ 10ఏ కింద పిటిషన్ దాఖలు చేసింది. కానీ, దీన్ని కుటుంబ న్యాయస్థానం తిరస్కరించింది. పెళ్లయిన తర్వాత ఏడాది పాటు విడిగా ఉండాలన్న నిబంధన పాటించనందుకు దీనికి అర్హత లేదని పేర్కొంది. 

ఈ ఉత్తర్వులను క్రిస్టియన్ దంపతులు కేరళ హైకోర్టులో సవాలు చేశారు. ‘‘న్యాయం పొందే హక్కును చట్టబద్ధమైన నిబంధనలు అడ్డుకుంటే, అవి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నందున కోర్టు వాటిని కొట్టివేయవచ్చు. జీవించే హక్కు న్యాయపరమైన పరిష్కారానికి కూడా వర్తిస్తుంది’’ అని హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. దంపతుల విడాకుల పిటిషన్ ను స్వీకరించాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది.

More Telugu News