fifa: మళ్లీ మ్యాజిక్ చేసి అర్జెంటీనాను ప్రపంచ కప్ సెమీస్ కు చేర్చిన మెస్సీ

Argentina qualifies for semifinals after win in penalty shootouts
  • ఉత్కంఠగా సాగిన క్వార్టర్ ఫైనల్ షూటౌట్లో నెదర్లాండ్స్ పై గెలుపు
  • నిర్ణీత సమయంతో పాటు షూటౌట్ లో గోల్ సాధించిన మెస్సీ
  • సెమీస్ లో క్రొయేషియాతో పోటీ పడనున్న అర్జెంటీనా
సాకర్ సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా ప్రపంచ కప్ నెగ్గాలన్న తన కలను నెరవేర్చుకునేందుకు మరింత చేరువయ్యాడు. మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా ఫిఫా వ‌ర‌ల్డ్‌ క‌ప్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్ర‌వారం అర్ధరాత్రి లుసైల్ స్టేడియంలో జ‌రిగిన రెండో క్వార్ట‌ర్స్ మ్యాచ్‌లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్ లో 4–3 స్కోరు తేడాతో నెద‌ర్లాండ్స్‌ జట్టుపై ఉత్కంఠ విజయం సాధించి టోర్నీలో ముందంజ వేసింది. 

అనేక మలుపులతో సాగిన ఈ మ్యాచ్ లో నిర్ణీత సమయంలో ఇరు జట్లూ 2–2తో సమంగా నిలిచాయి. అర్జెంటీనా తరఫున నహుయెల్ మొలినా 35వ నిమిషంలో, మెస్సీ 73వ నిమిషంలో గోల్స్ చేయడంతో నిర్ణీత 90 నిమిషాల్లోనే అర్జెంటీనా 2–0తో ఘన విజయం సాధించేలా కనిపించింది. 

కానీ, నెదర్లాండ్స్ ఆటగాడు వౌట్ వెగ్ షార్ట్  (83వ, 90 11వ నిమిషాల్లో) చివరి నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టి స్కోరు సమం చేశాడు. అదనపు సమయంలో మరో గోల్ రాకపోవడంతో ఈ మ్యాచ్ పెనాల్టీ షూటౌట్ కు దారి తీసింది. ఇందులో ఐదు ప్రయత్నాల్లో అర్జెంటీనా నాలుగు సార్లు సక్సెస్ అయింది. తొలి ప్రయత్నంలో మెస్సీ ఆ తర్వాత పరెడెజ్, గోంజాలో  గోల్స్ చేశారు. నాలుగో ప్రయత్నంలో ఎంజో ఫెర్నాండెజ్ ఫెయిలైనా, ఐదోసారికి మార్టినెజ్ స్కోరు చేశాడు.

మరోవైపు తొలి రెండు పెనాల్టీల్లో విఫలమైన నెద్లర్లాండ్స్ జట్టు ఆఖరి మూడు పెనాల్టీల్లో గోల్స్ చేసినా 3–4తో ఓటమి పాలైంది. దాంతో, అర్జెంటీనా సెమీస్ చేరుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్ ను పెనాల్టీ షూటౌట్ లో 4–2 తేడాతో ఓడించిన క్రొయేషియాతో అర్జెంటీనా సెమీఫైనల్లో పోటీ పడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం రాత్రి జరుగుతుంది.
fifa
world cup
football
messi
Argentina
semifinal

More Telugu News