Crime Serial: క్రైం సీరియల్ చూసి మితిమీరిన మోతాదులో మందులిచ్చి.. భర్తను హతమార్చిన భార్య

Wife killed husband after inspire with crime serial
  • భర్త తన పేరిట ఆస్తి రాయడేమోనన్న అనుమానంతో హత్య
  • ప్రియుడితో కలిసి ప్లాన్
  • అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్ల దెబ్బతిన్న అవయవాలు
క్రైం సీరియల్ ఇచ్చిన ప్రేరణతో మోతాదుకు మించి ఔషధాలు ఇచ్చి భర్తను చంపేసిందో ఇల్లాలు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో జరిగిందీ ఘటన. ఇటీవల జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. కాన్పూరులోని స్థానిక కల్యాణ్‌పూర్ శివ్లీ రోడ్డు ప్రాంతానికి చెందిన రిషభ్ గత నెల 27న ఓ వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా దుండగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఈ నెల 1న డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తర్వాత రెండు రోజులకే ఆరోగ్యం విషమించి మృతి చెందాడు. 

భార్య సప్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. అధిక మోతాదులో ఔషధాలు తీసుకోవడం వల్లే రిషభ్ మరణించినట్టు నిర్ధారించారు. ఔషధాలు అధిక మోతాదులో తీసుకోవడం వల్ల అవయవాలు దెబ్బతిన్నాయని, ఆయన మరణానికి అదే కారణమని తేల్చారు. 

దీంతో రిషభ్ భార్య సప్నాతోపాటు మరికొందరు అనుమానితుల ఫోన్ కాల్స్, వాట్సాప్ చాటింగులను పరిశీలించడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త తన పేరిట ఆస్తి రాయడేమోనన్న అనుమానంతో ప్రియుడు రాజుతో కలిసి సప్నానే ఈ హత్య చేయించినట్టు నిర్ధారణ అయింది. ఓ క్రైం సీరియల్ ఇచ్చిన ప్రేరణతో మోతాదుకు మించి భర్తకు మందులు ఇవ్వడం ద్వారా ఆయన హత్యకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది. విచారణలో సప్నా ఈ విషయాన్ని అంగీకరించింది. దీంతో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Crime Serial
Uttar Pradesh
Kanpur
Crime News

More Telugu News