Sankranti: సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు.. 4,233 ప్రత్యేక బస్సులు!

  • జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులో ప్రత్యేక బస్సులు
  • 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సదుపాయం
  • అమలాపురం, విశాఖ సహా పలు ప్రాంతాలకు బస్సులు
  • తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ట్రిప్పులు
TSRTC Announced Special Buses On The Eve Of Sankranthi

సంక్రాంతి పండుగ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పండుగ రద్దీ వేళ ప్రయాణికుల తిప్పలు తగ్గించేందుకు ఏకంగా 4,233 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది 3,736 బస్సులు ఏర్పాటు చేయగా, ఈసారి పది శాతం అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం గమనార్హం. అంతేకాదు, వీటిలో 585 బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుండగా, 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. గతంలో ఈ రిజర్వేషన్ సదుపాయం నెల రోజుల ముందు మాత్రమే ఉండేది. వచ్చే ఏడాది జూన్ నెలాఖరు వరకు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 125 అమలాపురానికి, 117 బస్సులు కాకినాడకు, 83 బస్సులు కందుకూరుకు, 65 విశాఖపట్టణానికి, 51 పోలవరానికి, 40 రాజమహేంద్రవరానికి నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని సజ్జనార్ తెలిపారు.

More Telugu News