Prathibha Sihgh: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు.. ప్రతిభాసింగ్‌ను సీఎం చేయాలంటూ ఆందోళనలు

Pratibha Singh Supporters protest in front of Chhattisgarh CM
  • హిమాచల్ సీఎంను ఎంపిక చేసే బాధ్యతను భూపేశ్ బఘేల్‌పై పెట్టిన అధిష్ఠానం
  • సిమ్లాలో హోటల్ వద్ద ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న ప్రతిభాసింగ్ మద్దతుదారులు
  • నేడు సీఎం ఎంపిక సమావేశం
హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. ఆ పార్టీ పీసీసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్‌ను సీఎంగా చేయాలంటూ ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అధిష్ఠానం ఆదేశాలతో నిన్న సిమ్లా వచ్చిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌‌ను ప్రతిభా సింగ్ మద్దతుదారులు అడ్డుకున్నారు. ఒబెరాయ్ సెసిల్ వద్ద బఘేల్ కాన్వాయ్‌ను అడ్డుకుని, ప్రతిభాసింగ్‌ను సీఎం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ప్రతిభా సింగ్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు సోనియా గాంధీ తనపై పెట్టిన బాధ్యతను దిగ్విజయంగా నెరవేర్చానని, ఇప్పుడు తాను రాష్ట్రాన్ని కూడా నడిపించగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వీరభద్రసింగ్ పేరుతో ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినప్పుడు ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టడం సరికాదని అన్నారు. పార్టీలో గ్రూపులు లేవంటూనే అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రతిభా సింగ్ చెప్పడం  గమనార్హం.

ప్రతిభాసింగ్ ప్రస్తుతం మండీ నుంచి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్ పోటీ చేసి విజయం సాధించారు. కాగా, హిమాచల్ ముఖ్యమంత్రి పదవి రేసులో చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి. వీరిలో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు, మాజీ విపక్ష నేత ముకేశ్ అగ్నిహోత్రి, మాజీ పీసీసీ చీఫ్ కుల్‌దీప్ సింగ్ రాథోడ్, ఠాకూర్ కౌల్‌సింగ్, ఆశాకుమారి, హర్షవర్ధన్ చౌహాన్ వంటివారు ఉన్నారు. ఈ రోజు సాయంత్రం వీరంతా సమావేశమై ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు.
Prathibha Sihgh
Himachal Pradesh
Congress

More Telugu News