ఓర్వలేకపోతున్నారు... అసూయతో కుళ్లిపోతున్నారు: వైసీపీ నేతలపై పవన్ ట్వీట్ల వర్షం

  • పవన్ బస్సు యాత్రకు ప్రత్యేక వాహనం
  • ఆలివ్ గ్రీన్ రంగులో వాహనం
  • వైసీపీ నేతల విమర్శనాస్త్రాలు
  • తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన పవన్
  • వైసీపీని ఉద్దేశించి వరుస ట్వీట్లు
Pawan flurry of tweets targeted YCP

తన బస్సు రంగును ప్రశ్నించిన వైసీపీ నేతలపై జనసేనాని పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు వంటి చిల్లర పనులు ఆపి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వైసీపీ నేతలకు హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వేధింపుల వలన కారు నుంచి కట్ డ్రాయర్ కంపెనీల దాకా పక్క రాష్ట్రానికి తరలిపోయాయని విమర్శించారు. 

భరించలేని అసూయతో వైసీపీ నేతలు రగిలిపోతున్నారని, నానాటికి వైసీపీ కుళ్లిపోతోందని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. "ఈర్ష్యతో బాధపడే విద్యార్థులు ఇతరుల వస్తువులను నాశనం చేసినప్పుడు మా స్కూల్ టీచర్ ఒక సూక్తిని పదేపదే చెప్పేవారు. హృదయంలో శాంతి ఉంటే ఆ దేహానికి ఆయుష్షు పెరుగుతుంది. కానీ హృదయంలో కుళ్లు కుతంత్రాలు ఉంటే వారి ఎముకలు కుళ్లిపోతాయి అని చెప్పేవారు" అని పవన్ వివరించారు. 

ఇదే వరుసలో పవన్ ఒనిడా టీవీ వాణిజ్య ప్రకటనను కూడా ప్రస్తావించారు. పొరుగువాడికి కడుపుమంట, యజమానికి గర్వకారణం అంటూ సాగే ఒనిడా యాడ్ పిక్ ను పంచుకున్నారు. ఈ యాడ్ నాకు చాలా ఇష్టం అని వెల్లడించారు. 

మరో ట్వీట్ లో ఆలివ్ గ్రీన్ రంగులో ఉన్న ఓ కారు, బైక్ ఫొటోలను కూడా షేర్ చేశారు. నియమనిబంధనలు కేవలం పవన్ కల్యాణ్ కోసమే అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఇంకా, పచ్చని చెట్లతో కూడిన ఓ గార్డెన్ ఫొటోను పోస్టు చేసిన పవన్... ఇందులో మీకు ఏ రకం పచ్చదనం నచ్చింది వైసీపీ? అంటూ వెటకారం ప్రదర్శించారు. కాగా, పవన్ ట్వీట్లకు స్పందన అంతాఇంతా కాదు. వేలల్లో లైకులు, రీట్వీట్లు వస్తున్నాయి.


More Telugu News