కేసీఆర్ చెప్పాడని పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమైనప్పుడే జగన్ భాగోతం బయటపడింది: దేవినేని ఉమ

  • పోలవరంపై దేవినేని ఉమ జూమ్ ప్రెస్ మీట్
  • జగన్ చేతగాని దద్దమ్మ అంటూ వ్యాఖ్యలు
  • పోలవరంపై చేతులెత్తేశాడని ఎద్దేవా
Devineni Uma fires on CM Jagan over Polavaram

జగన్ రెడ్డి చేతగాని దద్దమ్మ కాబట్టే, పోలవరం పూర్తిచేయలేమని చేతులెత్తేశాడని టీడీపీ సీనియర్ నేత, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. 72 శాతం పనులు చేసిన చంద్రబాబుకే ప్రాజెక్ట్ పూర్తిచేసే సత్తా, దమ్ము ఉన్నాయని స్పష్టం చేశారు. 

2021 జూన్, 2021 డిసెంబర్, 2022 డిసెంబర్ అంటూ కబుర్లు చెప్పిన జగన్, చివరకు పోలవరాన్ని 2024 జూన్ నాటికి కూడా నిర్మించలేమని కేంద్రానికి లేఖ రాశాడని ఉమ ఎద్దేవా చేశారు. చేతిలో 30 మంది ఎంపీలను ఉంచుకొని ప్రాజెక్ట్ అంచనా వ్యయం (రూ.55.548కోట్లు) డీపీఆర్-2ని ఆమోదింపజేసుకోలేని అసమర్థుడిగా నిలిచిపోయాడని వ్యాఖ్యానించారు. 

అవినీతికోసం రాష్ట్ర రైతాంగాన్ని పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రికి తాకట్టుపెట్టిన ఘనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. కేసీఆర్ చెప్పాడని, పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమైనప్పుడే జగన్ భాగోతం బయటపడిందని అన్నారు. 

"కేసీఆర్ సామంతుడు కాబట్టే, జగన్ రెడ్డి పోలవరాన్ని పడుకోబెట్టాడు. లక్షా 6 వేల మంది నిర్వాసితులుంటే, వారికి పరిహారం తగ్గించవచ్చన్న ఆలోచనతో పోలవరం ఎత్తు తగ్గించడానికి సిద్ధమయ్యాడు. పక్కరాష్ట్ర ముఖ్యమంత్రి తనకు ఎన్నికల్లో డబ్బులిచ్చాడన్న కృతజ్ఞతతో పోలవరం ఎత్తు తగ్గించి, గొప్ప ప్రాజెక్ట్ ను బ్యారేజ్ గా మార్చాడు. కేసీఆర్ సామంతుడిగా మారిన జగన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని 135 అడుగులుగా నిర్ధారించాడు" అని ఆరోపించారు.

"అధికారులు చెప్పింది తానెందుకు వినాలన్న జగన్ రెడ్డి మూర్ఖత్వమే పోలవరానికి శాపంగా మారింది. అధికారుల మాటలు తలకెక్కించుకోకుండా, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి బంధువైన పీటర్ అధ్యక్షతన జగన్ రెడ్డి పోలవరం నిర్మాణంపై కమిటీని వేశాడు. అతను చెప్పింది విని, చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉండి పోలవరం పునాదులు కూడా లేపలేదంటూ దుష్ప్రచారం చేశాడు. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి, చివరకు ప్రాజెక్ట్ నిర్మించలేమనే దుస్థితికి వచ్చాడు. 

ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రశ్నిస్తే, బుద్ధిలేని మంత్రులేమో బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారు. ఒకడేమో బుల్లెట్లు దింపుతామని ప్రగల్భాలు పలికి, చివరకు పత్తా లేకుండాపోయాడు. సంబరాల అంబటి రాంబాబేమో తలాతోకా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతాడు. సోంబేరి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ రెడ్డి పులివెందులకు నీళ్లిచ్చాడంటూ, సోయి లేకుండా మాట్లాడతాడు. హెలికాఫ్టర్లో పెళ్లిళ్లకు వెళ్లే ముఖ్యమంత్రికి నిర్వాసితుల ముఖంచూసే సమయంలేదా? చంద్రబాబుగారు పోలవరం నిర్వాసితుల్ని పరామర్శించడానికి వెళ్తే, తన బండారం బయటపడుతుందన్న భయంతో జగన్ రెడ్డి ఆయన్ని అడ్డుకున్నాడు" అంటూ ఉమ మండిపడ్డారు.


More Telugu News