Impact Player: ఐపీఎల్ లో 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ భారత ఆటగాళ్లకే వర్తిస్తుందట!

  • ఐపీఎల్ లో కొత్త రూల్
  • ఇంపాక్ట్ ప్లేయర్ పేరిట సబ్ స్టిట్యూట్ విధానం
  • సబ్ స్టిట్యూట్ తో బౌలింగ్, బ్యాటింగ్ చేయించే వెసులుబాటు
  • విదేశీ ఆటగాళ్లకు వర్తించని వెసులుబాటు
Impact Player rule in IPL only for Indian Players

ఐపీఎల్ ను మరింత జనరంజకం చేసేందుకు బీసీసీఐ ఇటీవల ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసుకువచ్చింది. ఫుట్ బాల్ తరహాలో ఇక నుంచి ఐపీఎల్ జట్లు కూడా సబ్ స్టిట్యూట్ ఆటగాళ్ల ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చు. వారితో బౌలింగ్, బ్యాటింగ్ చేయించే వీలుంటుంది. ఈ కొత్త వెసులబాటు ద్వారా, జట్టులోని 11 మందికి తోడు మరో అదనపు ఆటగాడిని కూడా ఆడించినట్టవుతుంది. పేరుకే సబ్ స్టిట్యూట్ అయినా... బ్యాటింగ్, బౌలింగ్ చేస్తాడు కాబట్టి పూర్తిస్థాయి ఆటగాడి కింద లెక్క! 

అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై మరింత స్పష్టత వచ్చింది. ఆయా జట్లు సబ్ స్టిట్యూట్ గా తీసుకునే ఆటగాడు భారత్ ఆటగాడై ఉండాలి. విదేశీ ఆటగాళ్లను సబ్ స్టిట్యూట్ గా ఉపయోగించుకోవడం కుదరదు. 

ఐపీఎల్ లో తుది జట్లలో కేవలం నలుగురు విదేశీ ఆటగాళ్లనే తీసుకోవాలన్నది ఓ నిబంధనగా ఉంది. ఇప్పుడు సబ్ స్టిట్యూట్ రూపంలో విదేశీ ఆటగాళ్లను తీసుకుంటే నలుగురు ఆటగాళ్ల నిబంధనకు విఘాతం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కేవలం భారత ఆటగాళ్లకే వర్తింపజేసేలా బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి అమల్లోకి రానుంది.

More Telugu News