Hyderabad: ద్రవ్యోల్బణం భయ్.. హైదరాబాద్ లో ఇరానీ ఛాయ్ రూ.20

  • చాలా ప్రాంతాల్లో రూ.20కి చేరిన కప్పు ధర 
  • ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రూ.15కే లభ్యం
  • పాల ధరలు, పనివారి వేతనాల భారం వల్లే ధరలు పెంచాల్సి వస్తోందన్న వర్తకులు
Inflation pushes up cost of Irani chai to Rs 20

ద్రవ్యోల్బణం అన్నింటినీ కొండెక్కిస్తోంది. తిండి లేపోయినా, కప్పు టీ తాగి పూట గడిపే సామాన్యులు మన మధ్య ఎంతో మంది ఉంటారు. ముఖ్యంగా భాగ్యనగరంలో పని లభించని రోజున కూలీలను ఆదుకునేది ఇరానీ ఛాయ్. సామాన్యులనే కాదు.. నవాబులు అయినా, మరొకరు అయినా ఇరానీ ఛాయ్ ను ఇష్టపడని వారు అరుదు. ఇరానీ ఛాయ్ లో ఉస్మానియా బిస్కెట్ ముంచి తింటే ఆ రుచే వేరు. కాలంతో పాటు దీని ధర కూడా పైకి ఎగబాకుతోంది. తాజాగా కప్పు ఇరానీ ఛాయ్ ధర రూ.20కి చేరింది. 

పాల ధర ఏటేటా పెరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. దీనికితోడు గత ఏడాది కాలంలో టీ పొడి ధరలు కూడా బాగానే పెరిగాయి. దీంతో టీ షాపుల్లో తేనీరు కూడా ఖరీదెక్కింది. ధర పెరిగిందని విక్రయాలు తగ్గాయని అనుకోకండి. టీ కూడా నిత్యావసరమే కదా. చుక్క టీ సేవించకపోతే ఆ రోజంతా డల్ గా ఉంటుంది. అందుకే రూ.20కి చేరినా, ఇరానీ ఛాయ్ కు డిమాండ్ తగ్గలేదు. నగరవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇరానీ ఛాయ్ రేటును వర్తకులు రూ.20కు పెంచగా.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కప్పు రూ.15కే లభిస్తోంది. లమాకాన్ లోనూ రూ.15కే అందుబాటులో ఉంది. 

పాల ధరలు పెరిగాయని, పనివారికి వేతనాలు కూడా అధికంగా చెల్లించాల్సి వస్తోందని వర్తకులు చెబుతున్నారు. దీని ఫలితమే ఛాయ్ రేట్లు పెంచాల్సి వస్తున్నట్టు వారు పేర్కొంటున్నారు. నిజమే మరి అన్ని ధరలు పెరుగుతుంటే.. ఛాయ్ ధర మాత్రం వేడెక్కకుండా ఉంటుందా?

More Telugu News