Nadendla Manohar: వారాహి వాహనం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదు: నాదెండ్ల మనోహర్

  • ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకున్న ఘనత వైసీపీదన్న నాదెండ్ల
  • చట్ట వ్యతిరేక పనులను జనసేన చేయదని వ్యాఖ్య
  • ఏపీఎస్ఆర్టీసీని వైఎస్ఆర్టీసీగా మార్చేశారని విమర్శ
YSRCP doesnt have right to speak about Varahi says Nadendla Manohar

పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహి రంగుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసుకుని కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్న చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. వారాహి వాహనం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదని చెప్పారు. 

చట్టానికి వ్యతిరేకంగా జనసేన ఎప్పుడూ పని చేయదని అన్నారు. ఎన్నికల్లో వారాహి ప్రచార వాహనంగా ఉపయోగపడుతుందని చెప్పారు. విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీలను సందర్శించడానికి వెళ్తే తమను అడ్డుకున్నారని మండిపడ్డారు. బీసీ గర్జనకు ఎన్ని ఆర్టీసీ బస్సులు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీఎస్ఆర్టీసీని వైఎస్ఆర్టీసీగా మార్చేశారని విమర్శించారు. పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదని సర్పంచ్ లు పోరాడుతుంటే... వారి చెక్ పవర్ ను లాగేసుకుంటున్నారని మండిపడ్డారు.

ఏపీ, తెలంగాణ మళ్లీ కలవాలనేదే తమ విధానమన్న సజ్జల రామకృష్ణరెడ్డి వ్యాఖ్యలను మనోహర్ ఖండించారు. రెండు రాష్ట్రాల ప్రజలకు సజ్జల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలు కలవాలనుకున్నప్పుడు 3 నెలల్లోనే ఏపీ ఆస్తులను తెలంగాణకు ఎందుకు కట్టబెట్టారని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు కలిసుంటే బాగుంటుందని చెపుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. 

More Telugu News