Uttar Pradesh: రాంపూర్ లో రీపోలింగ్ నిర్వహించాలంటున్న యూపీ మాజీ సీఎం అఖిలేష్

 Want Re Poll Election Not Fair says Akhilesh Yadav As Party Loses Key Seat
  • యూపీలోని రాంపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం
  • 1980 నుంచి ఎస్పీ కంచుకోటగా రాంపూర్ సెగ్మెంట్
  • పోలింగ్ రోజు అక్రమాలు జరిగాయని, అందుకే తమ పార్టీ ఓడిందని అఖిలేష్ విమర్శలు
ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ అంసెబ్లీ నియోజకవర్గానికి రీపోలింగ్ నిర్వహించాలని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ఎన్నిక పోలింగ్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయన ఆరోపించారు. దాంతో, తిరిగి ఎన్నిక నిర్వహించాలని భారత ఎన్నికల కమిషన్ ను అఖిలేష్ కోరారు. 

ఎస్పీకి చాలా ఏళ్ల నుంచి కంచుకోట లాంటి రాంపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఎస్పీ అగ్రనేత ఆజం ఖాన్ పై అనర్హత వేటు పడటంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇక తాజా ఎన్నికలో బీజేపీ అభ్యర్థి అకాశ్ సక్సేనా 33 వేల ఓట్ల మెజారిటీతో ఎస్పీ అభ్యర్థి అసిమ్ రాజాపై గెలుపొందారు. ఈ సెగ్మెంట్ లో బీజేపీ విజయం సాధించడం ఇదే తొలిసారి. 1980 నుంచి ఆజం ఖాన్, కుటుంబ సభ్యులే ఈ నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ, ఈ సారి మాత్రం ఫలితం తలకిందులైంది. 

అయితే, ఈ ఉప ఎన్నిక సక్రమంగా జరగలేదని అఖిలేష్ ఆరోపించారు. పోలింగ్ సమయంలో తాము రాష్ట్ర ఎన్నికల సంఘానికి పదేపదే ఫిర్యాదులు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధ పడ్డామని అన్నారు. ఈ నియోజకవర్గంలో కేవలం 30 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది. తమ పార్టీ మద్దతుదారులను ఓటు వేయడానికి పోలీసులు, ఇతర అధికారులు అనుమతించకపోవడమే దీనికి కారణమని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.

‘ఎన్నికల కమిషన్ వీటన్నింటిని పరిశీలించకపోతే మనం ఎవరిపై విశ్వాసం ఉంచాలి? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మా మద్దతుదారులను అవమానించింది. కొందరిపై దాడి కూడా చేశారు. ఓటు వేయకుండా అడ్డుకున్నారు‘ అని అఖిలేష్ ఆరోపించారు. అయితే, ఎస్పీ చేసిన ఆరోపణలను యూపీ ప్రభుత్వం ఇది వరకే ఖండించింది. తమ ప్రభుత్వం, రాంపూర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉప ఎన్నిక స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగిందని పేర్కొంది. 
Uttar Pradesh
rampur
Samajwadi Party
Akhilesh Yadav
re poll

More Telugu News