Amit Lodha: ‘ఖాకీ’ వెబ్ సిరీస్‌కు ప్రేరణ అయిన బీహార్ ఐపీఎస్ అధికారిపై అవినీతి మరక

Corruption case against IPS Amit Lodha who inspired Netflix show Khakee
  • ‘బీహార్ డైరీస్’ పేరుతో పుస్తకం రాసుకున్న అమిత్ లోధా
  • ఆ పుస్తకం రాసేందుకు ఆయనకు అధికారం లేదంటున్న పోలీసులు
  • నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రైవేటు సంస్థలతో చేతులు కలిపారని ఆరోపణ
  • నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ఖాకీ: ద బీహార్ చాప్టర్’
‘ఖాకీ’ వెబ్ సిరీస్‌తో వెలుగులోకి వచ్చిన బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధాకు అవినీతి మరక అంటుకుంది. బీహార్ పోలీసుకు చెందిన స్పెషల్ మానిటరింగ్ యూనిట్ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, నేరపూరిత కుట్రకు సంబంధించి భారతీయ శిక్ష స్మృతిలోని సెక్షన్ 120(బి), సెక్షన్ 168 కింద కేసులు నమోదు చేసింది. అమిత్ తాను రాసుకున్న ‘బీహార్ డైరీస్’ ఆధారంగా ‘ఖాకీ’ వెబ్ సిరీస్ రూపొందింది. 

ఇప్పుడిదే పుస్తకం ఆయన తలకు చుట్టుకుంది. వెబ్ సిరీస్ కోసం లోధా నల్లధనాన్ని ఉపయోగించినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు. లోధాకు పుస్తకం రాసే అధికారం కానీ, దానిని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు కానీ అధికారం లేదని అందులో పేర్కొన్నారు. 

ప్రభుత్వ అధికారి అయి ఉండీ ఆయన చట్టవిరుద్ధంగా ప్రైవేట్/ వాణిజ్య పరమైన కార్యకలాపాల కోసం నెట్‌ఫ్లిక్స్, ఖాకీ సినిమాను నిర్మించిన ఫ్రైడే స్టోరీ టెల్లర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో చేతులు కలిపినట్టు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో వారి ప్రమేయం, కార్యకలాపాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు సంస్థలు అందించిన దర్యాప్తు నివేదికను పోలీసులు సమీక్షించి ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 

అక్రమంగా సంపాదించేందుకు, నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేందుకు లోధా ఆయన రాసిన ‘బీహార్ డైరీ’ పుస్తకాన్ని ఉపయోగించుకున్నట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ‘ఖాకీ: ద బీహార్ చాప్టర్’ అనేది ఓ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన కథ. బీహార్‌లోని షేక్‌పురా జిల్లాలో జరిగిందీ ఘటన. 24 మందిని హత్య చేసిన వ్యక్తిని పోలీసు అధికారి ఎలా పట్టుకున్నాడన్నదే ఈ కథ. ‘బీహార్ డైరీస్’ పేరుతో లోధా స్వయంగా పుస్తకం రాసుకోగా, ఫ్రైడే స్టోరీ టెల్లర్ ప్రైవేట్ లిమిటెడ్ దీనిని వెబ్ సిరీస్‌గా రూపొందించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల ఇది విడుదలై మంచి రివ్యూలు సంపాదించుకుంది.
Amit Lodha
Netflix
Khakee
Curruption

More Telugu News