Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో 8 మంది మంత్రుల ఓటమి

 8 ministers in Jai Ram Thakurs cabinet lost Assembly election
  • హిమాచల్ ప్రదేశ్‌లో 40 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్
  • 25 స్థానాలకే పరిమితమైన బీజేపీ
  • 12 మంది మంత్రుల్లో ఏకంగా 8 మందికి నిరాశ
  • కాంగ్రెస్‌కు కలిసొచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకున్న కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 68 స్థానాలకు గాను కాంగ్రెస్ మ్యాజిక్ మార్కు కంటే ఐదు సీట్లు (40) ఎక్కువే గెలుచుకోగా, బీజేపీ 25 స్థానాలకే పరిమితమైంది. ఇతరులకు మూడు స్థానాలు దక్కాయి.

ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కేబినెట్‌లోని ఏకంగా 8 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. ఓటమి పాలైన వారిలో సురేశ్ భరద్వాజ్, రాకేశ్ పఠానియా కూడా ఉన్నారు. సిమ్లా అర్బన్, నార్పూర్ నియోజకవర్గాలకు చెందిన వీరు.. కసుంప్టి, ఫతేపూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ‘అవుట్ సైడర్ ట్యాగ్’ వీరి ఓటమికి కారణమైంది.

ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ కేబినెట్‌లో ఆయన సహా మొత్తం 12 మంది మంత్రులు ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఈ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింది. ఓటమి పాలైన సిట్టింగ్ మంత్రుల్లో గోవింద్ సింగ్ ఠాకూర్, రామ్ లాల్ మార్కండ, రాజిందర్ గార్గ్, రాజీవ్ సేజల్, సర్వీన్ చౌదరి, వీరేందర్ కన్వర్ ఉన్నారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మహేందర్ సింగ్ తన స్థానాన్ని ఖాళీ చేసి కుమారుడు రజత్ ఠాకూర్‌కు ఇచ్చి తనయుడి రాజకీయ ప్రవేశానికి బాటలు వేశారు. అయితే, ఆయన ప్రయత్నాలు వృథా అయ్యాయి. ఆయన కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరోవైపు, కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు ముఖ్యమంత్రి ఆశావహుల్లో ముగ్గురు ఓటమిని మూటగట్టుకున్నారు. డల్హౌసీ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆశా కుమారి 9,918 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అలాగే, మాజీ మంత్రులు కౌల్ సింగ్, రామ్ లాల్ ఠాకూర్‌లు వరుసగా 618, 171 ఓట్ల అతి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. నహాన్ నుంచి బరిలోకి దిగిన అజయ్ సోలంకి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్‌పై 1,693 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

అలాగే, బీజేపీ రెబల్ అభ్యర్థి ఆశిష్ శర్మ హమీర్పూర్ నుంచి విజయం సాధించి ఆశ్చర్యపరిచారు. బార్మౌర్ నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జనక్ రాజ్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఠాకూర్ సింగ్ బార్మౌరిని ఓడించారు. ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ నుంచి తిరుగుబాటు ఎదుర్కొన్న రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుల్దీప్ రాథోడ్ జయకేతనం ఎగురవేశారు.
Himachal Pradesh
Congress
Jai Ram Thakur

More Telugu News