Jagan: పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు సీఎం జగన్ దిశానిర్దేశం

  • పార్టీ బలోపేతంపై సీఎం జగన్ దృష్టి
  • 50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నట్టు జగన్ వెల్లడి
  • కొత్తగా గృహ సారథులు, కన్వీనర్ల ఎంపిక
  • పార్టీ బలోపేతంలో వారిదే కీలక పాత్ర అని వివరణ
CM Jagan directs party coordinators and district heads

ఏపీలో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మంత్రం జపిస్తున్నాయి. మరో ఒకటిన్నర ఏడాదిలో ఎన్నికలు రానుండగా, ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్ వైసీపీ సమన్వయ కర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై వారితో చర్చించారు. గడపగడపకు పార్టీని తీసుకెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 

గరిష్ఠంగా 15 రోజుల్లో 1.66 కోట్ల కుటుంబాలను కలుసుకునే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో వైసీపీ సైన్యాన్ని వ్యవస్థీకృతం చేయడమే ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. 

50 కుటుంబాల వారీగా మ్యాపింగ్ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి 50 ఇళ్లకు ఒక మహిళ, మరో వ్యక్తి గృహ సారథులుగా ఉంటారని వివరించారు. ఆ విధంగా 15 వేల గ్రామాల్లో 5.2 లక్షల మంది గృహసారథులు ఉంటారని సీఎం జగన్ పేర్కొన్నారు. 

అంతేకాకుండా, గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో పార్టీ తరఫున ముగ్గురు కన్వీనర్లు ఉంటారని, రాష్ట్రం మొత్తమ్మీద 45 వేల మంది కన్వీనర్లు ఉంటారని తెలిపారు. కన్వీనర్లను ఎంపిక చేసే బాధ్యత ఎమ్మెల్యేలు/నియోజకవర్గాల ఇన్చార్జిలకు అప్పగిస్తున్నామని వెల్లడించారు. వీరిపై నియోజకవర్గాల పరిశీలకుల పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. ఎంపికైన వారు పార్టీ నుంచి వచ్చే సందేశాలను, పబ్లిసిటీ మెటీరియల్ ను గడపగడపకు చేరవేస్తారని సీఎం జగన్ వివరించారు.

బూత్ స్థాయి నుంచే బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేయడమే లక్ష్యమని, నెట్వర్క్ ఎంత బలంగా ఉంటే గెలవడం అంత సులువు అవుతుందని అన్నారు. మొత్తం 175 స్థానాలు గెలవడమే అందరి కర్తవ్యం కావాలని ఉద్బోధించారు.

More Telugu News