Nirmala Sitharaman: ఫోర్బ్స్ టాప్-100 శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్

  • వరుసగా నాలుగో ఏడాది కూడా నిర్మలకు చోటు
  • తాజాగా 36వ స్థానంలో నిర్మల
  • మొత్తం ఆరుగురు భారతీయులకు జాబితాలో చోటు
  • అగ్రస్థానంలో ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా
Nirmala Sitharaman gets place in Forbes Most Powerful Women Top 100

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం భారత్ కు ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తూ, గత కొన్నేళ్లుగా బడ్జెట్ లను ప్రవేశపెడుతూ తన సత్తా చాటుకుంటున్న నిర్మలా సీతారామన్ కు విశిష్ట గౌరవం లభించింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక ప్రపంచ టాప్-100 శక్తిమంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ కు మరోసారి చోటు కల్పించింది. 

ఈ జాబితాలో నిర్మలకు 36వ స్థానం దక్కింది. 2019 నుంచి ఆమె ఫోర్బ్స్ జాబితాలో క్రమం తప్పకుండా ఉంటున్నారు. 2019లో 34వ స్థానం, 2020లో 41వ స్థానం, 2021లో 37వ స్థానంలో నిలిచారు. 

2022 ఫోర్బ్స్ లిస్టులో నిర్మలతో పాటు హెచ్ సీఎల్ టెక్ చైర్ పర్సన్ రోష్నీ నాడార్ (53), సెబీ చైర్ పర్సన్ మధాబీ పూరీ బుచ్ (54), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ సోమా మోండాల్ (67), బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా (72), నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుణి నాయర్ (89) కూడా స్థానం దక్కించుకున్నారు. 

ఫోర్బ్స్ టాప్-100 మోస్ట్ పవర్ ఫుల్ మహిళల జాబితాలో అగ్రస్థానం యూరోపియన్ యూనియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ కు లభించింది. అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి నేత కమలా హ్యారిస్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచారు.

More Telugu News