Budda Venkanna: బీసీలపై చర్చకు నేనే వైసీపీ ఆఫీసుకు వస్తా... అప్పలరాజు, జోగి రమేశ్ లకు బుద్దా వెంకన్న సవాల్

  • బీసీ అంశంపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
  • జగన్ బీసీ జపం ఎన్నికల స్టంట్ అన్న వెంకన్న
  • చంద్రబాబుకు బీసీలు నీరాజనం పడుతున్నారని వ్యాఖ్య  
  • జగన్ ఓర్వలేకపోతున్నాడని విమర్శలు  
Budda Venkanna challenges YCP ministers

మూడున్నరేళ్ల జగన్ రెడ్డి పాలన ఆసాంతం బీసీల హత్యలు, వారి భూముల కబ్జాలు, వారి ఆస్తుల లూటీలతోనే సాగిందని, ముఖ్యమంత్రికి ఉన్నపళంగా బీసీలపై ప్రేమపుట్టుకు రావడం అంతా ఎన్నికల స్టంట్ లో భాగమని టీడీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విమర్శించారు. 

మూడున్నరేళ్లలో  బీసీ నేతల హత్యలు, వారిపై దాడులు, వేధింపులకు పాల్పడి, వారి ఆస్తులు, భూములు లాక్కున్న జగన్ రెడ్డి, ఎన్నికల స్టంట్ లో భాగంగానే బీసీల జపం మొదలెట్టాడని ఆరోపించారు. బీసీలకు మంచి, న్యాయం చేయాలన్న ఆలోచన ఏ కోశానా జగన్ రెడ్డికి లేదని అన్నారు. ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని సంవత్సరాలు తలకిందులుగా తపస్సు చేసినా జగన్ కు బీసీల మద్ధతు లభించదని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు. కేవలం బీసీల్ని చంద్రబాబుకి, టీడీపీకి దూరం చేయాలన్న కుట్రతప్ప, బీసీలపై జగన్ కు ప్రేమలేదని మండిపడ్డారు. 

"వై.ఎస్.కుటుంబం ఎదిగిందే బీసీల సమాధులపై. ఆవిషయం ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబునాయుడికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే జగన్ బీసీలపై కపటప్రేమ చూపుతున్నాడు. జగన్ బీసీ సభలో వాలంటీర్లు, పోలీసులు, బారికేడ్లే తప్ప బీసీలు లేరు. రాష్ట్ర జనాభాలో 50 శాతం బీసీలుంటే, జగన్ సభలో వాలంటీర్లు, పోలీసులు 50 శాతమున్నారు. వేదికమీద ఉన్న వైసీపీ బీసీ నేతలు తప్ప, సభకు బీసీలు రాలేదు" అని వెల్లడించారు. 

"చంద్రబాబు వస్తేనే బీసీలకు సబ్ ప్లాన్, ఆదరణ, చంద్రన్నబీమా, విద్యార్థులకు విదేశీవిద్య, స్టడీసర్కిళ్లు, ఫీజు రీయింబర్స్ మెంట్ , పెళ్లికానుక వస్తాయని బలహీనవర్గాలు ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాయి. బీసీలు జగన్ రెడ్డిని నమ్మడంలేదు కాబట్టే, చంద్రబాబు సభలకు భారీగా తరలివస్తున్నారు. చంద్రబాబు జయహో బీసీలు అంటే, బీసీలు జయహో చంద్రబాబు అంటున్నారు. 

తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని, అవినీతి ప్రణాళికలు వేస్తూ, వీడియో గేమ్ లు ఆడుకోవడంతప్ప, జగన్ రెడ్డి ఏనాడైనా బీసీల గురించి ఆలోచించాడా? తనకు ఊడిగం చేసే ఒకరిద్దరికి ఉన్నత పదవులిచ్చి, బీసీలు తనకు వెన్నెముక, నేను వారికి జున్నుముక్క అంటూ జగన్ రెడ్డి కహానీలు చెబుతున్నాడు" అని ఘాటుగా విమర్శించారు. 

బీసీలకు చంద్రబాబుచేసిన మేలు, జగన్ రెడ్డి చేసిన ద్రోహంపై చర్చించడానికి తాను సిద్ధమని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు. "వైసీపీ బీసీ ప్రజాప్రతినిధులు, బీసీమంత్రులు ఎప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను రెడీ. చంద్రబాబు, జగన్ ల హయాంలో బీసీలకు జరిగిన మేలు, వారి సంక్షేమానికి వారిద్దరూ చేసిన ఖర్చు, ఇతరత్రా వివరాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్ లకు ఇదే విషయంపై సవాల్ విసురుతున్నా. అవినీతికి మారుపేరైన వారిద్దరికీ దేవాలయంలాంటి టీడీపీ కార్యాలయంలో అడుగుపెట్టే అర్హతలేదు. అందుకే బీసీల కోసం అవసరమైతే నేనే వైసీపీ కార్యాలయానికి వెళ్లడానికి కూడా సిద్ధం" అని స్పష్టం చేశారు.

More Telugu News