KCR: జగిత్యాల జిల్లా కలెక్టరేట్ భవనం ప్రారంభించిన సీఎం కేసీఆర్

CM KCR inaugurates Jagityal district collectorate building
  • జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
  • మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన
  • అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్.1 అని వెల్లడి
  • ప్రజల సహకారంతోనే ఇది సాధ్యమైందని స్పష్టీకరణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. మెడికల్ కాలేజీ భవనానికి శంకుస్థాపన చేశారు. జగిత్యాల సభలో ఆయన ప్రసంగిస్తూ, ఈరోజు అనేక రంగాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని తెలిపారు. ప్రజలందరి సమష్టికృషితోనే ఇది సాధ్యమైందని అన్నారు. 

తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాలకు మేలు జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పండిన ధాన్యం ఎక్కడ అమ్ముకోవాలన్న చింత లేకుండా, రైతులు తమ గ్రామాల్లోనే ధాన్యం అమ్ముకునే సదుపాయం కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ వివరించారు. 

దీనివెనుక ఒక పరమార్థం ఉందని, ఎవరికో సాయం చేయాలన్న దృక్పథం కాదని అన్నారు. చెల్లాచెదురైన తెలంగాణ రైతాంగం, మళ్లీ ఒకచోటికి చేరి వ్యవసాయంలో అద్భుతమైన ప్రగతి సాధించాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. తెలంగాణలో 3 కోట్ల టన్నుల పైచిలుకు వరిధాన్యాన్ని పండిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. 

"నేను అసెంబ్లీలో ఒక మాట చెప్పాను. ఐదేళ్ల లోపు మిషన్ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీరు అందిస్తామని మాటిచ్చాను. ఆ విధంగా చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని, ఓట్లు అడగోమని చెప్పాను. ఇలా చెప్పడానికి చాలా ధైర్యం, సాహసం కావాలి. ఎన్నో ఆటంకాలు అధిగమించి ఈ పథకం తీసుకువచ్చాం" అని వివరించారు. 

ఇక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికే పెన్షన్లు ఇవ్వాలని, పెన్షన్లు ఇస్తే ఆర్థిక అవసరాలు తీరేలా ఉండాలని కేసీఆర్ పేర్కొన్నారు.
KCR
Jagityal District
Collectorate
Inauguration
TRS
Telangana

More Telugu News