jayaho bc sabha: బీసీలకు రాజ్యాధికారం కల్పించిన నేత జగన్: స్పీకర్ తమ్మినేని

AP speaker tammineni fires on chandrababu at Jayaho BC sabha
  • సమాజంలో తలెత్తుకుని జీవించేలా చేశారన్న తమ్మినేని 
  • తోకలు కత్తిరిస్తానని బీసీలను హేళన చేశారని చంద్రబాబుపై మండిపాటు
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలన్న తమ్మినేని
బీసీలకు సమున్నత స్థానం కల్పించి, సమాజంలో తలెత్తుకు జీవించేలా చేసిన ముఖ్యమంత్రి జగన్ కు సభకు హాజరైన అందరి తరఫునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. విజయవాడలో జరుగుతున్న జయహో బీసీ సభలో స్పీకర్ పాల్గొని మాట్లాడారు. బీసీలను కించపరిచారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమ్మినేని మండిపడ్డారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తామంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని సభా వేదికపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీసీలు జడ్జిలుగా పనికిరారా.. మేం పనికిరామని లేఖలు రాస్తారా.. మాకు తెలివితేటలు లేవా? అని చంద్రబాబును స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. దేనికీ కార్పొరేషన్లు, దేనికీ డైరెక్టర్ పదవులు.. ఎందుకు ఇవి నాలుక గీసుకోవడానికా? అంటూ హేళన చేస్తున్నారని స్పీకర్ మండిపడ్డారు. ఈ ఆర్డర్లు పేపర్లే కదా అని పొరపాటున నాలుక గీసుకునేవు అచ్చన్నా.. నీ నాలుక పీలికలవుతుందని హెచ్చరించారు. వచ్చే ఎన్నికలలో ఇదే బీసీలు చరిత్ర గతి తిరగరాస్తారని జోస్యం చెప్పారు.

ముసుగు వేసుకొని బీసీ ద్రోహులు మారువేషంలో వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని బీసీలను స్పీకర్ తమ్మినేని అప్రమత్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని తమ్మినేని పిలుపు నిచ్చారు. బీసీలకు దామాషా పద్ధతిలో రాజ్యాధికారం ప్రసాదించిన మహనీయుడు జగన్ రెడ్డి అని స్పీకర్ చెప్పారు. కార్పొరేషన్ల నుంచి మంత్రిమండలి దాకా.. ఇలా అన్నింట్లోనూ బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించారని జగన్ ను స్పీకర్ తమ్మినేని కొనియాడారు.
jayaho bc sabha
AP Speaker
Jagan
YSRCP
Chandrababu

More Telugu News