Duvvada Railway Station: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఎంసీయే విద్యార్థిని నరకయాతన.. రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయిన యువతి

  • రాయగడ ఎక్స్‌ప్రెస్‌లో దువ్వాడ చేరుకున్న విద్యార్థిని
  • స్టేషన్‌లో దిగుతూ జారిపడి పట్టాల కిందికి
  • పలు ప్రయత్నాల తర్వాత ప్లాట్‌ఫామ్‌ను బద్దలుగొట్టి రక్షించిన రెస్క్యూ సిబ్బంది
  • గంటన్నర ఆలస్యంగా కదిలిన రైలు
MCA Student Stuck between Rail and Plot Farm in Duvvada Station

విశాఖపట్టణం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఓ ఎంసీఏ విద్యార్థిని ఫ్లాట్‌ఫాం-రైలు మధ్య ఇరుక్కుపోయింది. బయటకు రాలేక రెండు గంటలపాటు అలాగే ఉండిపోయింది. చివరికి ప్లాట్‌ఫామ్‌ను బద్దలుగొట్టి ఆమెను రక్షించాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అన్నవరానికి చెందిన 20 ఏళ్ల శశికళ దువ్వాడలోని ఓ కాలేజీలో ఎంసీఏ ఫస్టియర్ చదువుతోంది. రోజువారీలానే గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ రైలులో దువ్వాడ చేరుకుంది. స్టేషన్‌లో దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్ కిందికి జారిపడింది. దీంతో ప్లాట్‌ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయింది.

బయటకు వచ్చేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ విఫలమైంది. ప్రయాణికులు కూడా ఆమెను బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి సమాచారం అందుకున్న రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతి ఇరుక్కుపోయిన చోట ప్లాట్‌ఫామ్‌ను బద్దలుగొట్టి ఆమెను రక్షించారు. ఇందుకోసం దాదాపు గంటన్నర సమయం పట్టింది. గాయపడిన శశికళను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెను బయటకు తీసిన అనంతరం దాదాపు గంటన్నర తర్వాత రైలు అక్కడి నుంచి బయలుదేరింది.

More Telugu News