TDP: రేపటి బీసీల సభ కూడా అట్టర్ ఫ్లాపే: అచ్చెన్నాయుడు

  • విజయవాడలో రేపు వైసీపీ జయహో బీసీ సభ
  • వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు
  • బీసీలను దగా చేశారంటూ ఆగ్రహం
TDP leaders slams YCP leaders

వైసీపీ పార్టీ విజయవాడలో జయహో బీసీ సభ నిర్వహించనున్న నేపథ్యంలో టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం జగన్ బీసీలను దగా చేశాడంటూ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, కళావెంకట్రావు, కొల్లురవీంద్ర, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు,  ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపించాకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బలహీనవర్గాలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా గుర్తింపు లభించిందని అన్నారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయావర్గాలు తమకు సహకరించడం లేదన్న అక్కసు రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల నరనరాల్లో ఉందని విమర్శించారు. "తెలుగుదేశంపార్టీ నుంచి బలహీన వర్గాలను విడదీయాలన్న కుటిల బుద్ధితోనే జగన్ ఈ మధ్య బీసీల జపంచేస్తున్నాడు. రాష్ట్రంలో 2.14 కోట్ల మంది బీసీలుంటే, 47 లక్షలమందికి అరకొరసాయం చేస్తే ఉద్ధరించినట్టా?" అని విమర్శించారు.

"బలహీనవర్గాల గౌరవం, ఆత్మాభిమానాన్ని జగన్ రెడ్డి నడిబజారులో పడేసినా స్పందించలేని దుస్థితిలో బీసీమంత్రులు ఉన్నారు. ఒక మంత్రి వై.వీ.సుబ్బారెడ్డి కాళ్లకు మొక్కుతాడు. మరోమంత్రి విజయసాయి ముందు చేతులు కట్టుకుంటాడు. బొత్స సత్తిబాబు నోరెత్తితే ఏం చేస్తారో అనే భయంతో బతుకుతున్నాడు" అంటూ వ్యాఖ్యానించారు.

రేపటి బీసీల సభ కూడా అట్టర్ ప్లాపేనని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. "బీసీలకోసం జగన్ రెడ్డి ‘జయహోబీసీ’ కార్యక్రమం పెట్టాడు. జయహో బీసీ పేరు ఎవరిది? 2018లో చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకోసం రాజమహేంద్రవరంలో నిర్వహించిన సభకు ఆ పేరు పెట్టాం. సొంతంగా పేరుపెట్టుకోలేని బడుద్దాయిలు బీసీలను ఉద్ధరిస్తారా?" అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. 

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్ని కులాలకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. హింసించే రాజు పులకేశి సినిమా చూస్తే జగన్ రెడ్డే గుర్తొచ్చాడని వెల్లడించారు. ఆ సినిమాలో హీరో వేషధారి మీసం... ఆ హావభావాలు అన్నీ జగన్ రెడ్డి మాదిరే ఉన్నాయని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ రెడ్డి కూడా ఆ సినిమా ఒకసారి చూస్తే తను ఎంతటి మూర్ఖుడో అతనికే అర్ధమవుతుందని అయ్యన్న హితవు పలికారు. బీసీలకు తానేం చేశాడో జగన్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయగలడా? పదవులు రెడ్లకు, పనికిమాలిన స్థానాలు బీసీలకా? అని అయ్యన్న మండిపడ్డారు.

More Telugu News