Farmer: సింగరేణి ఆఫీసు ముందు ఎద్దు మూత్రవిసర్జన చేసిందని రైతుకు జరిమానా

  • తన భూమిని సింగరేణి కంపెనీ తీసుకుందన్న రైతు
  • పరిహారం చెల్లించాలంటూ ఆఫీసు ముందు నిరసన
  • ఎద్దుతో మూత్రం పోయించాడని రైతుపై అధికారుల ఫిర్యాదు
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • రైతుకు కోర్టులో రూ.100 జరిమానా
Farmer fined for his Ox urinate in front of Singareni company

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సీసీఎల్) కార్యాలయం ముందు ఓ ఎద్దు మూత్ర విసర్జన చేసిందని రైతుకు జరిమానా విధించారు. 

అసలేం జరిగిందంటే... సుందర్ లాల్ లోధ్ ఒక రైతు. తన నుంచి తీసుకున్న భూమికి సింగరేణి కంపెనీ పరిహారం చెల్లించేందుకు నిరాకరిస్తోందంటూ సుందర్ లాల్ తన కుటుంబంతో సహా కంపెనీ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టాడు. ఈ నిరసనలో అతడు తన ఎద్దుల బండితో పాటు పాల్గొన్నాడు. 

అయితే, ఆ జోడెద్దుల్లో ఒకటి సింగరేణి కార్యాలయం గేటు ఎదుట మూత్రం పోసింది. దాంతో సింగరేణి అధికారులు ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుందర్ లాల్, అతడి కుటుంబం తమ కార్యాలయం ఎదుట రభస సృష్టిస్తున్నారని, ఎద్దులతో మూత్రం పోయించి అపరిశుభ్రంగా మార్చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైతును పోలీసులు కోర్టులో హాజరుపర్చగా, ఆ రైతుకు రూ.100 జరిమానా విధించారు. దీనిపై రైతు స్పందిస్తూ, ఎద్దుతో తాను మూత్రం పోయించలేదని స్పష్టం చేశాడు. 

ఆ రైతు కుమార్తె మానసి స్పందిస్తూ, అధికారుల తీరును ఖండించింది. ప్రజలు మూత్ర విసర్జన చేస్తుంటే ఎవరికీ జరిమానా విధించరు కానీ, ఇక్కడ ఎద్దు మూత్రం పోసిందని జరిమానా విధించారు అంటూ విమర్శలు చేసింది. 

అటు, సింగరేణి అధికారులు వివరణ ఇచ్చారు. కోర్టులో రైతు పిటిషన్ తిరస్కరణకు గురైందని, అయినప్పటికీ అతడు తమ కార్యాలయం ముందు ఇబ్బందికర వాతావరణం సృష్టిస్తున్నాడని ఆరోపించారు.

More Telugu News