సక్సెస్ ను కాపాడుకోవడమే పెద్ద టాస్క్: దిల్ రాజు

05-12-2022 Mon 20:32 | Entertainment
  • నవంబర్ 18వ తేదీన వచ్చిన 'మసూద'
  • తొలి రోజున వచ్చిన సక్సెస్ టాక్ 
  • ఇంకా థియేటర్స్ లో రన్ అవుతున్న సినిమా 
  • నిర్మాతను ప్రశంసించిన దిల్ రాజు
Masooda Thank You Meet
తెలుగు ప్రేక్షకులకు హారర్ థ్రిల్లర్ సినిమాలు కొత్త కాదు. కొత్తదనం ఉన్న హారర్ థ్రిల్లర్ సినిమాలను వారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వస్తున్నారు. అలా ప్రేక్షకుల ఆదరణ పొందిన హారర్ థ్రిల్లర్ గా 'మసూద' కనిపిస్తుంది. నవంబర్ 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. మంచి వసూళ్లను రాబడుతూ థియేటర్స్ లో నిలబడింది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ 'థ్యాంక్యూ మీట్' ను నిర్వహించింది. ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడుతూ  ... "సినిమాను ఫ్యాషన్ గా భావించి .. సినిమాపైనే పూర్తి దృష్టిపెడితే తప్పకుండా సక్సెస్ ను సాధించవచ్చని ఈ జనరేషన్ లో నిర్మాత రాహుల్ నిరూపించాడు. తన బ్యానర్ నుంచి వరుసగా మూడు హిట్ సినిమాలు రావడమే అందుకు నిదర్శనం. 

ఇక ఇప్పుడు రాహుల్ పై ఉన్న బాధ్యత ఏమిటంటే .. వచ్చిన సక్సెస్ ను కాపాడుకోవడమే. సక్సెస్ ను కాపాడుకోవడమే అసలైన పెద్ద టాస్క్. రాహుల్ మరిన్ని మంచి సినిమాలను నిర్మిస్తాడని ఆశిస్తున్నాను. ఈ సినిమా తరువాత వచ్చిన 'లవ్ టుడే' .. 'హిట్ 2' కూడా సక్సెస్ ను సాధించడం ఆనందంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చారు.