ఢిల్లీలో ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం... హాజరైన సీఎం జగన్, చంద్రబాబు

05-12-2022 Mon 19:40 | National
  • భారత్ కు జీ-20 అధ్యక్ష బాధ్యతలు
  • వచ్చే ఏడాది భారత్ లో జీ-20 శిఖరాగ్ర సమావేశం
  • నేడు సన్నాహక సదస్సు.. హాజరైన కేంద్ర మంత్రులు
  • హాజరైన పలువురు సీఎంలు, పార్టీల అధినేతలు
PM Modi held all party meeting in Delhi
ఈ ఏడాది జీ-20 అధ్యక్ష బాధ్యతలు భారత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో నేడు సన్నాహక సదస్సు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన ఈ అఖిలపక్ష సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్, ఎస్.జైశంకర్, వివిధ రాష్ట్రాల సీఎంలు, పార్టీల అధినేతలు హాజరయ్యారు. 

ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. కాగా, జగన్, చంద్రబాబు ఒకే వరుసలో కూర్చున్నారు.

2023 సెప్టెంబరు 9, 10 తేదీల్లో జీ-20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో, ఆ సమావేశం అజెండాపై నేడు చర్చించారు. ఇతర దేశాలకు భారత్ అందించాల్సిన సందేశం, వివిధ దేశాలతో చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.