హైదరాబాదుకు తరలివచ్చిన అతిపెద్ద లోహ విహంగం... వీడియో ఇదిగో!

05-12-2022 Mon 16:56 | Telangana
  • భారీ కార్గో విమానాన్ని తయారుచేసిన ఎయిర్ బస్
  • తిమింగలం ఆకారంలో బెలూగా
  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో విజయవంతంగా ల్యాండింగ్
  • స్వాగతం పలికిన ఎయిర్ పోర్టు వర్గాలు
Airbus Beluga landed at Hyderabad airport
భాగ్యనగరానికి అరుదైన అతిథి విచ్చేసింది! ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్ బస్ బెలూగా లోహ విహంగం హైదరాబాదులో ల్యాండైంది. ఈ విశిష్ట అతిథికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్వాగతం పలికాయి. 

ఎయిర్ బస్ బెలూగా గత రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఈ భారీ విమానం ల్యాండింగ్, పార్కింగ్ కోసం ఎయిర్ పోర్టు అథారిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ విమానం నేటి రాత్రి 7.20 నిమిషాల వరకు హైదరాబాదులోనే ఉంటుంది. 

దుబాయ్ లోని మాక్టోం విమానాశ్రయం నుంచి థాయ్ లాండ్ వెళుతూ మార్గమధ్యంలో ఇంధనం నింపుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. 

భారీతనానికి మారుపేరుగా నిలిచే ఏఎన్ ఆంటోనోవ్ కార్గో విమానం కూడా 2016లో ఇక్కడి విమానాశ్రయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ల్యాండైంది. తమ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక వనరులు పుష్కలంగా ఉన్నాయని, భారీ విమానాలు సైతం సాఫీగా ల్యాండవడం అందుకు నిదర్శనమని ఎయిర్ పోర్టు నిర్వహణ వర్గాలు వెల్లడించాయి. 

కాగా, ఎయిర్ బస్ సంస్థ తయారుచేసిన ఈ బెలూగా విమానం పొడవు 56 మీటర్లు, బరువు 95 టన్నులు. ఇది 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎయిర్ బస్ సంస్థ దీన్ని ఒక తిమింగలం రూపంలో డిజైన్ చేసింది.